టేకులపల్లి, జనవరి 22 : నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని బీ కాలనీ తండాలో గురువారం కార్డెన్ సెర్చ్, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ లో 35 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర వాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్… రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా తెలిపారు. గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకత, సైబర్ క్రైం నివారణ, గ్రామాల్లోకి వచ్చే అనుమానిత వ్యక్తుల విషయంలో అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఐక్యమత్యంగా ఉంటూ శాంతియుతంగా మెలగాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటాయని, ప్రతి రోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదలకు కారణాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందిచడమే కాకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్, టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, గుండాల సీఐ తిరుపతి, టేకులపల్లి, బోడు ఎస్ఐలు అలకుంట రాజేందర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Tekulapalli : ప్రజలను అప్రమత్తం చేసేందుకే కార్డెన్ సెర్చ్ : ఇల్లందు డీఎస్పీ చంద్రబాను