Dacoit | అడివి శేష్,మృణాట్ ఠాకూర్ జంటగా నటిస్తున్న బైలింగ్వల్ చిత్రం డెకాయిట్‌పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా ‘రూబరూ’ వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఇదే సందర్భంగా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించారు. “మోసం అంటే ఏంటో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే…” అంటూ జైల్లో ఉన్న హీరో బాధతో ప్రారంభమయ్యే ‘రూబరూ’ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. డెకాయిట్‌గా మారకముందు అతని జీవితంలో జరిగిన ప్రేమకథను ఈ పాటలో చూపించారు. ప్రేమలో మునిగిపోయిన యువకుడు ఎలా భగ్న ప్రేమికుడిగా మారి, చివరికి డెకాయిట్‌గా మారాడన్న ఆసక్తిని సాంగ్ రేకెత్తిస్తోంది.
ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియా స్వరాలు సమకూర్చగా, చిన్మయి శ్రీపాదతో కలిసి ఆలపించారు. “మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే…” అంటూ భాస్కర భట్ల రవికుమార్ అందించిన అర్థవంతమైన సాహిత్యం ప్రేమలో ఉన్నప్పుడు హీరో మనసులోని భావాలను అందంగా ప్రతిబింబించింది. పాట వినడానికి మాత్రమే కాదు, చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ జంట చూడముచ్చటగా కనిపించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు సాంగ్ ద్వారా స్పష్టమైంది. లిప్ లాక్ సీన్ కూడా ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. అంతగా ప్రేమించుకున్న జంట ఎందుకు విడిపోయారు? మృణాల్ పాత్ర ఎందుకు మోసం చేసింది? హీరో డెకాయిట్‌గా ఎలా మారాడు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం సినిమా చూడాల్సిందే.
మొదట ఈ చిత్రాన్ని 2026 ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి, సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే తేదీన నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ‘స్వయంభు’ విడుదల కానుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ ఉండే అవకాశముంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.