గురుకులాల రద్దుకు పన్నాగం
విద్యా పాలసీ ముసుగులో రాష్ట్ర విద్యారంగంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కక్షతో ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యాకమిషన్ నివేదికను రూపొందించిందని మండిపడ్డారు.
- విద్యారంగంపై రేవంత్ సర్కార్ కుట్ర
- విద్యాకమిషన్ పేరిట తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
- ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నివేదిక
- కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేలా సిఫారసులు
- కమిషన్ చైర్మన్ నోట రాజకీయాలు దుర్మార్గం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : విద్యా పాలసీ ముసుగులో రాష్ట్ర విద్యారంగంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కక్షతో ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యాకమిషన్ నివేదికను రూపొందించిందని మండిపడ్డారు. గతంలో రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాలనే కమిషన్ రిపోర్టులో చేర్చారని ఆరోపించారు.
రేపటి తరానికి మంచి విద్యనందించడాన్ని విస్మరించి ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు ప్రాధాన్యమివ్వడం దురదృష్టకరమన్నారు. కమిషన్ సిఫారసులు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు. టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నివేదించడం దుర్మార్గమని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన రిపోర్ట్‌ను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తబుట్టలో పడేస్తామని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరులతో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణకు గొప్ప విద్యావిధానం రూపొందిస్తామని ప్రగల్భాలు పలికిన విద్యాకమిషన్.. జాతీయ విద్యావిధానం-2020లోని అంశాలనే కాపీ కొట్టిందని ఆరోపించారు.
టీచర్ల ఆత్మగౌరవానికి భంగం..
విద్యాకమిషన్ నివేదికలోని అంశాలు రాష్ట్రంలోని 1.70 లక్షల మంది టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. వేతనాల్లో కోతపెట్టేందుకు యత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. పీఆర్సీ చేయాల్సిన పనిని విద్యాకమిషన్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘టీచర్లు సక్రమంగా పనిచేయకపోవడంతోనే ఎన్రోల్మెంట్ తగ్గిందని అంటున్నరు.. టెస్టులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలంటున్నరు.. పని తీరు ఆధారంగా రెగ్యులరైజ్ చేయాలని చెబుతున్నరు.. కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలంటున్నరు..’ ఇలా ఉపాధ్యాయులను అభద్రతాభావంలోకి నెట్టేలా సిఫారసులు ఉన్నాయని ఆక్షేపించారు.
కార్పొరేట్ల మేలు కోసమే ఎప్‌సెట్ రద్దు
ఎప్‌సెట్‌ను రద్దుచేసి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లు భర్తీ చేయాలని చెప్పడం బాధాకరమని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఈ సిఫారసుతో నారాయణ, శ్రీచైతన్య, గౌతమి లాంటి కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మేలు జరిగి, గ్రామీణ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం పొంచిఉన్నదని చెప్పారు. పేద పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను రద్దుచేసే కుట్రలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌పై కక్షతోనే గురుకులాలపై విషం..
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే లక్ష్యంతోనే ఆకునూరి మురళి గురుకులాలపై విషం చిమ్ముతున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. వీటిలో చదువుతున్నది తెలంగాణ విద్యార్థులే కదా.. వారేమన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి రాలేదు కదా? అని ప్రశ్నించారు. గురుకులాలను దెబ్బతీస్తే అందులో చదివే విద్యార్థులు రోడ్లపై పడాలా? ప్రైవేట్ పాఠశాలలకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు అప్పుల పాలు కావాలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆడపిల్లలు ఉన్నత విద్యాభాసం కోసం కేసీఆర్ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కానీ, ఆయనపై కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ రెసిడెన్షియల్ స్కూళ్లపై కత్తిగడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీచర్ల రిక్రూట్మెంట్పై పచ్చి అబద్ధాలు
కేసీఆర్ పాలనలో గురుకులాల్లో టీచర్లను రిక్రూట్ చేయలేదని కమిషన్ పచ్చి అబద్ధాలు చెప్పిందని, తాను గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా 8 వేల మందికి ఉద్యోగాలిచ్చానని, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్వంలోనూ నియామకాలు జరిగాయని ఆర్ఎస్పీ గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ పబ్లిక్ స్కూళ్ల పేరిట ప్రజలను తప్పుదోవపట్టించేందుకు యత్నిస్తున్నదని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి విజన్ ఏంటో చెప్పాలి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఎంఈవోలు, డీఈవోలను నియమించకుండా పాఠశాల విద్యను గాలికొదిలేసిందని ఆర్ఎస్పీ ఆరోపించారు. అసలు సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావ్యవస్థపై ఉన్న విజన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా కాషాయీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. కొఠారి, డీడీ కోశాంబి లాంటి విద్యారంగ నిపుణుల సూచనలు పక్కనబెట్టి జాతీయ విద్యావిధానం పేరిట విద్యావ్యవస్థలో మతాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో విద్యావిప్లవం
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నో వినూత్న విధానాలు, పథకాలతో విద్యావిప్లవానికి అంకురార్పణ చేశారని ఆర్ఎస్పీ కొనియాడారు. నాడు నాణ్యమైన విద్యకు పునాది వేస్తే, నేడు రేవంత్‌రెడ్డి వాటిని ధ్వంసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే పీఆర్సీ కమిషన్ వేసి ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్, 5 శాతం ఐఆర్, రెండో విడత 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి కాంట్రాక్ట్ టీచర్ల వ్యవస్థను రద్దుచేసి రెగ్యులరైజ్ చేసినట్టు తెలిపారు. వెయ్యికిపైగా గురుకులాలు, 29 మెడికల్ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు నెలకొల్పారని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

