Drone Attack : సౌదీ అరేబియా (Saudi Arabia) లోని జజాన్లో ఉన్న అరామ్కో (Aramco) చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి (Drone Attack) చేసినట్లు హౌతీలు (Howthis) ప్రకటించారు. ఈ దాడికి తామే కారణమని హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరీ (Yahya saree) తెలిపారు. తమ గగనతలంలో సౌదీ డ్రోన్ల చొరబాటుకు ప్రతిస్పందనగానే దాడి చేసినట్లు వెల్లడించారు.
సౌదీ ‘మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ’ కూడా ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ఓ వైపు అమెరికా-ఇరాన్ ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది.
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కీయే దేశాలు ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ (Mecca joint defence agreement) పై సంతకాలు చేశాయి. మూడు దేశాల్లో ఏదైనా ఒకదానిపై సాయుధ దాడి జరిగితే మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించేలా ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతపై ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.