Nemmadi Shravan kumar | హనుమకొండ : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలవడానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును సుబేదారి వద్ద పోలీసులు అడ్డుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని నిరసిస్తూ, పోలీస్ స్టేషన్ వద్ద వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి BRSV (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) రాష్ట్ర నాయకుడు నెమ్మది శ్రావణ్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెమ్మది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గత 10 రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే G.O. నం. 97/2026ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU)లో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని, ఫీజుల పెంపు, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలిటెక్నిక్ విద్య అనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంతోపాటు ఉన్నత విద్యలో ముందుకు వెళ్లేందుకు కీలకమైన మార్గమని తెలిపారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ECET ద్వారా B.Techలో లేటరల్ ఎంట్రీ వంటి అవకాశాలు కొనసాగడం అత్యంత ముఖ్యమన్నారు. SBTET స్వయం ప్రతిపత్తి, డిప్లొమా విద్య ప్రాధాన్యత దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. G.O. నం. 97 కారణంగా విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలు, భవిష్యత్ కెరీర్‌పై అనిశ్చితి ఏర్పడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. 3 సంవత్సరాలు కష్టపడి డిప్లొమా చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం G.O. నం. 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణులతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా BRSV ఆధ్వర్యంలో విద్యార్థులను ఐక్యం చేసి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నెమ్మది శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్–నల్గొండ–ఖమ్మం కంటెస్టెంట్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి , BRSV నాయకులు, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్