Akhilesh Yadav | యూపీ (Uttar Pradesh)లో గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బలియాన్ హత్య ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కక్ష్యలు ఏవైనా ఉన్నాయేమోనని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి అని అఖిలేష్ అభివర్ణించారు. బలియాన్‌ను తల్లి తన ఒడిలో పెట్టుకుని రోడ్డుపై విలపిస్తున్న తీరు హృదయ విదారకరంగా ఉందని అన్నారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంకిత్ బలియాన్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో అతడి హత్యకు గురవడంపై అఖిలేష్ పై విధంగా స్పందించారు.
చంపింది మేమే
బలియాన్ హత్యకు తామే కారణమని గోగి ముఠా (Gogi Gang)కు చెందిన భోలు షాపురియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అందరి వంతు వస్తుంది అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. బలియాన్ తరహాలోనే మరిన్ని హత్యలు జరుగుతాయని ఆ పోస్ట్‌లో పోలీసులను హెచ్చరించాడు. బలియాన్‌కు తమ శత్రువుతో సంబంధాలు ఉన్నాయి. తమ ముఠాకు సంబంధించిన ఒక ఘటనపై పాట కూడా పాడాడు అని ఆ ముఠా ఆరోపించింది.
బలియాన్ పాట తరహాలోనే హత్య
బలియాన్ పాడిన ‘భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్’ పాటతో ఫేమస్ (Famous) అయ్యాడు. ఈ పాట తరహాలోనే అతడు హత్యకు గురవడంపై పలువురు అభిమానులు చర్చించుకుంటున్నారు. జాత్ జత్నీ, అగ్లా జనమ్, సవిధాన్, మోదీ బర్గా రుత్బా, జాత్ ధర్మేందర్ కి తరియా, ఏక్ ఖోలా జైల్ కే భితర్, వెయిట్ సిస్టమ్, రైఫ్లిన్ వంటి హిట్ పాటలను రూపొందించాడు. అతడి పాటల్లో ఎక్కువగా తుపాకులు, ఆయుధాలు, ఎస్‌యూవీలే కనిపిస్తాయి. అతడికి యూట్యూబ్‌లో 3.66 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అదేవిధంగా పాడ్‌కాస్ట్‌లో ఉత్తరప్రదేశ్, హర్యానాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేశాడు.

Ankit Baliyan
అన్ని కోణాల్లో దర్యాప్తు
హర్యాన్వీ (హర్యానా) గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బలియాన్ (35) జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చగా అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు లేదా నలుగురు దుండగులు పాల్గొని ఉండవచ్చని, 18 రౌండ్లు కాల్చారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) ఎంపీ సింగ్ వెల్లడించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. పాత కక్షలా, పంచాయతీ ఎన్నికలతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.