Mahashivratri | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 14: చరిత్ర ప్రసిద్ధిగాంచిన రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆగమానుసారంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ మంగళవాయిద్య సేవ ఉత్తిష్ఠగణపతికి హరిద్ర కుంకుమ విలేపణ అభిషేకం, రుద్రేశ్వరస్వామికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వర్తించి రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామివార్లను నంది వాహనంపై మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో ఎదురుకోలు నిర్వర్తించి రుద్రేశ్వరునికి ఎదురుగా సూర్యాలయంలో ఆది దంపతులను ప్రతిష్టించి గణపతి నవగ్రహ అష్టదిత్పాలక పూజలు నిర్వహించారు.
అనంతరం స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి-నీలిమ, గోదా-విష్ణువర్ధన్‌రెడ్డి దంపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి, రాంరెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి 5 రోజులపాటు జరిగే పంచాన్నిక దీక్ష ఉత్సవాలను బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన గణపతి నవగ్రహ పంచసూక్తములతో జయాధి హోమాలతో 18 అధ్యాయాలతో లోక కళ్యాణార్థం తెల్ల ఆవాలు, తోక మిరియాలు, ఇప్పపువ్వు, రక్తచందనం, సుగంధ ద్రవ్యపరిమళాలతో మహాచండీయాగం నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేద పండితులు భరత్‌శర్మ, శ్రీమన్నారాయణ, ప్రధ్యుమ్నశర్మ, గంగు మణికంఠశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్‌శర్మ పర్యవేక్షణలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.
మహాశివరాత్రి.. రాత్రి కళ్యాణోత్సవం..
మహాశివరాత్రి మహాపర్వదినం ఉదయం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్యసేవ ఉత్తిష్ఠ గణపతికి అభిషేకం, రుద్రేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి ఉదయం 5 గంటల నుంచి సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. సాయంత్రం 5.45 నిమిషాలకు ఉత్తరాషాడ నక్షత్రయుక్త సింహ లగ్న సుముహూర్తమున రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు.
రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో 12 మంది వేదపండితుల ఆధ్వర్యంలో పాశుపత పూర్వకమహా రుద్రాభిషేకం, నమకచమకాలతో రుద్ర ఆధ్యాయంతో 111 రుద్రములతో 101 లీటర్ల ఆవుపాలతో 51 కిలోల ఆవు పెరుగుతో 21 కిలోల పుట్టతేనెతో 11 కిలోల ఆవునెయ్యితో పండ్ల రసములతో మహారుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు, శివ ప్రీతికరమైన సోమవారం కూడా లింగోద్భవ కాల పూజ కలిసి వస్తుందని, జాగరణ ఉండే భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్‌లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్