DEO Vasanthi | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15 : 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేసిన కృషిని అభినందిస్తున్నట్లు, గత ఫలితాలలో మన జిల్లా 96.13 శాతం సాధించి 100 శాతానికి చేరువయ్యామని, ఈ విద్యా సంవత్సరం కూడా మరింత ముందుచూపు, క్షేత్రస్థాయి ప్రణాళికతో ప్రతి పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో పని చేయాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి కోరారు.
ఈ నెల 8వ తేదీ నుంచి సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పక్షాన ఇదివరకే తగిన సూచనలు జారీ చేసినట్లు, అకాడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా 10వ తరగతి విద్యార్థులకు జనవరి 9 వరకు మొత్తం పాఠ్యాంశాల బోధన పూర్తి చేయాలని, 10వ తరగతి విద్యార్థుల హాజరు ప్రతిరోజూ 100 శాతం ఉండేవిధంగా తల్లిదండ్రులు, హస్టల్ వార్డెన్లతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రత్యేక తరగతుల నిర్వహణకు వివరణాత్మక టైం టేబుల్, కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రణాళిక చేయబడిన విషయాలను స్పష్టంగా సూచించాలన్నారు. స
ప్రతి వారంతంలో సమీక్ష నిర్వహించి, లోటుపాట్లను సవరించుకోవాలని, ఈనెల 24 నుంచి జరిగే ఎస్ఏ-1 పరీక్షలలో 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పరీక్ష తదుపరి ప్రతి సబ్జెక్టు టీచర్ ఆ ప్రశ్నపత్రం ఆధారంగా నమూన జవాబు పత్రం(కీ పేపర్) తయారు చేసి విద్యార్థులకు చూపించాలని ఆదేశించారు.
గణితం, భౌతిక శాస్త్రం , ఇంగ్లీష్ వంటి కీలకమైన సబ్జెక్టులకు, ముఖ్యంగా విద్యార్థుల పనితీరు అంచనాస్థాయి కంటే తక్కువగా ఉన్నట్లయితే అదనపు సెషన్లు నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రతి ప్రత్యేక తరగతి రోజులోని అంశానికి సంబంధించిన ముఖ్యభావనలను 20 నిమిషాల వివరణతో ప్రారంభించి, ఆ తర్వాత 40 నిమిషాల మార్గదర్శక అభ్యాసంతో, అనువర్తనం కొనసాగించాలని, కీలక భావనలపై లేదా ఒకటి లేదా రెండు విద్యాప్రమాణాలకు అనుగుణంగా ఉన్న మూడు ప్రశ్నలపై దృష్టి పెట్టాలన్నారు.
మూడురోజుల బోధనా చక్రాన్ని అనుసరించాలి..
విద్యార్థులు స్వతంత్రంగా పాఠాలు చదవడానికి, ప్రశ్నలకు స్వయంగా సమాధానం రాయడానికి ప్రోత్సహించాలని, విద్యార్థుల అవగాహనను బలోపేతం చేయడానికి, పనితీరు మెరుగుపరచడానికి అభ్యాస దీపిక నుంచి ప్రశ్నలను నిరంతరం సాధన చేయడానికి మార్గనిర్దేశం చేయాలన్నారు. రెగ్యులర్ పీరియడ్‌లో సిలబస్ పూర్తి చేసిన తదుపరి, ప్రతి పాఠం, అంశానికి సంబంధించి మూడురోజుల బోధనా చక్రాన్ని అనుసరించాలని సూచించారు. 1వ రోజు పాఠం,అంశం వివరణ, 2వ రోజు ఆ అంశానికి సంబంధించిన విద్యాప్రమాణాల ఆధారంగా పరీక్ష నిర్వహించాలి, 3వ రోజు పరీక్ను విశ్లేషించి, ప్రభావవంతమైన సమాధాన రచనపై వ్యక్తిగత అభిప్రాయాన్ని అందించాలి.
గత మూల్యంకన సూత్రాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించాలని ఆమె కోరారు. విద్యార్థుల చేతిరాత, స్పష్టత, సమాధానాలు వెలిబుచ్చిన తీరును మెరుగుపరచడంపై ప్రాధాన్యతనివ్వాలని, ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల విభిన్న అభ్యాస స్థాయిలను దృష్టిలో ఉంచుకొని సిలబస్‌ను పూర్తి చేసేందుకు సమగ్రవిద్యా ప్రణాళిక తయారు చేసుకోవాలని, మెరుగైన ఫలితాలు సాధించడానికి స్థాయికి తగిన అభ్యాసాన్ని అందించడానికి విద్యార్థుల అభ్యాస స్థాయిలను ముందుగానే గుర్తించాలన్నారు.
విద్యార్థులను దత్తత తీసుకొని మార్గదర్శనం..
ఉత్తీర్ణత సాధించడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కేంద్రీకృత మద్దతు అందించాలని, ముఖ్యంగా గణితంలో గ్రాఫ్‌లు, రేఖాగణిత నిర్మాణాలు, సైన్స్‌లో రేఖా చిత్రాలు, ప్రయోగాలు, సాంఘికశాస్త్రంలో మ్యాప్ పాయింటింగ్, గ్రహణశక్తి, బాషాలు (తెలుగు, హిందీ, ఇంగ్లీష్)లో గ్రహణ భాగాలు, ఉపన్యాసాలు, సగటు పనితీరు కనబరిచే విద్యార్థుల ప్రమాణాలకు అనుగుణంగా సాధనచేయడం ద్వారా భావనాత్మకత స్పష్టతను బలోపేతం చేయడానికి మార్గనిర్దేశం చేయాలన్నారు.
సగటు కంటే ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహనను పెంచుకోవడానికి వైవిధ్యమైన, సవాలుతో కూడిన ప్రశ్నలతో విస్తృత అభ్యాసం చేయాలని, విద్యార్థులకు సబ్జెక్టుపై అవగాహన కోసం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న టీశాట్ ఛానల్ వారి పరీక్ష తయారీ వీడియోలను చూడమని ప్రోత్సహించాలని, వ్యక్తిగత విద్యాభ్యాసం అందించడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని మార్గదర్శనం, మద్దతు, బాధ్యతలలో ఉదయంవేళలో అధ్యయన అలవాటును ప్రోత్సహించేందుకు మేల్కొలుపు ఫోన్‌కాల్ చేసి నిద్రలేపాలని కోరారు. విద్యార్థులు ఏఏ స్థాయిల్లో ఇబ్బందులకు గురవుతున్నారో తెలుసుకుని వారి తల్లిదండ్రులతో కూడా ఎప్పటికప్పుడు చర్చించాలని, తరచూ తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి, సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయడానికి ప్రత్యేక రికార్డును నిర్వహించాలని డీఈవో వాసంతి ఆదేశించారు.
Kumuram Bheem | కుమ్రం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ