రాజాపేట, మార్చి 10 : పెండింగ్లో ఉన్న కాళేశ్వరం కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి గొలుసు కట్టు చెరువులు నింపాలని కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకుడు, రాజాపేట మాజీ సర్పంచ్ వంచ వీరారెడ్డి మంగళవారం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. కాళేశ్వరం 15 ప్యాకేజీలో భాగంగా బేగంపేట, చల్లూరు గ్రామాల రైతుల నుండి ప్రభుత్వం భూమిని సేకరించినప్పటికీ కాల్వ పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. కొండ్రెడ్డి చెరువు, మల్లెగూడం మీదుగా సింగారం వైపు కొంత మేరకు కాల్వ పనులు చేపట్టారని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకుని కాల్వ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాభావంతో నిండిన చెరువులు వేసవి సమీపించడంతో పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడగంటిపోయాయన్నారు. దాంతో బోర్లు, బావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం 15 ప్యాకేజీ ద్వారా రాజాపేట మండలంలోని గొలుసుకట్టు చెరువులను నింపేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.