రుద్రంపూర్, మార్చి 10 : అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే నైపుణ్యం ప్రతి ఉద్యోగికి అవసరమని, ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రాణాలను కాపాడే అవగాహనను పెంచుతాయని ఏరియా వర్క్ షాప్ డీజీఎం జే.క్రిస్టఫర్ అన్నారు. సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మంగళవారం రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సి.పి.ఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్), అగ్నిమాపక పరికరాల వినియోగంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం డివిజన్ అధికారి జే. క్రిస్టఫర్ పర్యవేక్షణలో, ఐఎన్టీయూసి ఫిట్ కార్యదర్శి ఎం.డి. సత్తార్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రెస్క్యూ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశంపై ఉద్యోగులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో గుండె లేదా శ్వాస ఆగిపోయిన వ్యక్తికి తక్షణం ఇవ్వాల్సిన ప్రాథమిక చికిత్స అయిన సిపిఆర్ విధానాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. గుండె ఆగిపోయిన మొదటి కొన్ని నిమిషాలు ‘గోల్డెన్ అవర్’గా పరిగణించబడుతాయని, ఆ సమయంలో సిపిఆర్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశాలు రెట్టింపు అవుతాయని వివరించారు. మెదడుకు రక్త ప్రసరణ కొనసాగేందుకు సిపిఆర్ ఎంతో కీలకమని తెలిపారు. నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఛాతిపై ఒత్తిడి ఇవ్వడం ద్వారా గుండె పనితీరును తాత్కాలికంగా కొనసాగించవచ్చని చెప్పారు.
అలాగే అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై కూడా వివరించారు. మంటలను ఆర్పే పరికరాలు ప్రధానంగా క్లాస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్/కే అనే ఆరు తరగతులుగా ఉంటాయని తెలిపారు. కలప, కాగితం వంటి ఘన పదార్థాల మంటలకు నీరు లేదా ఫోమ్, పెట్రోల్ అలాగే ఆయిల్ వంటి మండే ద్రవాలకు ఫోమ్, CO₂ లేదా డ్రై పౌడర్, మండే వాయువులకు డ్రై పౌడర్, లోహాల మంటలకు ప్రత్యేక డ్రై పౌడర్, విద్యుత్ కారణంగా కలిగే మంటలకు CO₂ లేదా డ్రై పౌడర్, వంట నూనెల వల్ల కలిగే మంటలకు తడి రసాయన పరికరాలను ఉపయోగిస్తారని వివరించారు. ఈ పరికరాలను సరైన విధంగా వినియోగిస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఇంజినీర్ టి.అనిల్, ఎంఆర్ఎస్ హెచ్ఓడీ అనంతరామయ్య, ఐఎన్టీయూసి ఫిట్ కార్యదర్శి ఎం.డి.సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.మధు కృష్ణతో పాటు రెస్క్యూ సిబ్బంది బి.నాగేశ్వరావు, ఎం.షణ్ముఖ చారి, సూపర్వైజర్లు బి.వెంకట్రాం, డి.భానుచందర్, ఎం.రోషన్, ఎస్.టి.యాకుబుద్దీన్, వర్క్ షాప్ ఉద్యోగులు, ట్రేడ్ అప్రెంటిస్‌లు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

ఏరియా వర్క్ షాప్‌లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన