46 GO | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : 46 జీవోపై కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ భగ్గుమన్నది. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గండికొట్టిన 46 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి జేఏసీ రాష్ర్ట కోఆర్డినేటర్ , కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో కేయూ ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కూడా దొంగ వైఖరి వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకట్ట వేస్తున్నాయని.. ఒకవైపు రాష్ర్టప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో చట్టంచేసి పార్లమెంట్‌కు పంపించి గవర్నర్లకు రాష్ర్టపతికి పంపించామని చెబుతూనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవడం అనేది విడ్డూరంగా ఉందన్నారు.
బీసీల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి బీసీల ఓట్లు కొల్లగొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా బీసీలకు ధర్మబద్ధంగా రావాలసిన 42 శాతం రిజర్వేషన్లపై డిసెంబర్ 1 నుంచి జరిగే శీతాకాల సమావేశంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి అఖిలపక్షాన్ని తీసుకొని పెద్దఎత్తున ఢిల్లీ పాలకులపైన పోరు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తోక ముడిచి బీసీల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
బీసీలకు ఒక్కటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదు..
బీసీలకు 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18 శాతం నుంచి 22 శాతం వరకు బీసీ రిజర్వేషన్లు అమలు జరిగితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో 16 నుంచి 20 శాతం వరకే రిజర్వేషన్లను కేటాయించాలని, అనేక డివిజన్లలో, మండలాల్లో బీసీలకు ఒక్కటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదని, మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికల్లో కంటే కనీసం రెండు, మూడు గ్రామాల బీసీ కోటాను తగ్గించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ర్టంలోని అధికారులు ఎలాంటి శాస్త్రీయతలేకుండా ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయింపులు చేశారని, అధికారులు చేసిన తప్పిదాల మూలంగా బీసీలకు గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల కంటే ప్రస్తుతం జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.
బీసీలు గమనించి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులకు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేంతవరకు పోరాటం చేయాలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరగాలంటే పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపైన చర్చ జరిగి రాజ్యాంగ సవరణ జరిగితేనే బీసీల కల సాకారమవుతుందని, బీసీల సత్తా ఏందో, దమ్మెంతో, ధైర్యమెంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు చూపించాలని పిలుపునిచ్చారు.
రాష్ర్టంలో అర శాతం లేని వాళ్లకి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వచ్చు కానీ 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం ఇవ్వడానికి కాకమ్మ కథలు చెప్పుకుంటూ వస్తున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మకూడదని బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు అన్వేష్, రవితేజ, సుధీర్, రాజశేఖర్, రాజేష్, అనిల్, రవి, గణేష్, నితిన్, సాయివరుణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త