Harish Rao | కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరెలు అందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 3.83 లక్షల మంది మహిళలు ఉంటే 1.99 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒక్క ఏడాదికి మాత్రమే చీరే ఇచ్చి సారే పెట్టిన అంటున్నారని విమర్శించారు. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ళంత ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 సంగతి ఏందని ప్రశ్నించారు. రెండేళ్లకు సంబంధించి 60వేలు ఇచ్చి సారే పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు చీరలు ఇస్తామని ఒకటే ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు.
పట్టణ ప్రాంతాల్లో చీరెలు లేవు… వడ్డీలేని రుణాలు లేవని హరీశ్‌రావు విమర్శించారు. పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవని అన్నారు. మహిళాసంఘాలు 25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే 5 వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగబడుతుందని అన్నారు. మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. గతంలో స్త్రీ నిధి కింద రుణాలు ఇచ్చాం.. ఇప్పుడు స్త్రీ నిధి వడ్డీ ఋణం ఇవ్వడం లేదని అన్నారు. స్త్రీ నిధికి కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళల పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడుతానని తెలిపారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క మహిళా సంఘాలకి ఒక్క బస్సు కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళ సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి రెండు ఏళ్ళు అయిన ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడ కూడా పెట్టలేదని చెప్పారు. కేసీఆర్ పండుగ పండుగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంకేమ పథకాలు ఇస్తున్నారని అన్నారు. రైతుబందు ఓట్లకు… చీరల పంపిణీ ఓట్లకే .. వడ్డీ లేని రుణాలు ఓట్లకే అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ సగం ఇచ్చిండు సగం ఎగొట్టిండు అని అన్నారు. ఆశ పెట్టడం.. ఆయాస పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం ఈ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు.