Kuravi Veerabhadra Swamy | కురవి, ఫిబ్రవరి 22 : కోరిన కోరికలు తీర్చే వీరభద్ర స్వామి (Kuravi Veerabhadra Swamy) గిరిజనుల ఆరాధ్య దైవంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో దశ హస్తుడై కోరమీసాలతో కొలువుతీరియున్నాడు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ నుండి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 16 రోజులపాటు నిర్విరామంగా అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ పాలక మండలి, అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థల పురాణము :
మహబూబాబాద్ జిల్లా కేంద్రమునకు 9కి.మీ. దూరమున పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రమునకు 70కి.మీ. రైలు మార్గమున, మహబూబాబాద్- మరిపెడ 365 జాతీయ రహదారి మార్గములో పెద్ద తటాకమునానుకొని కురవి మండల కేంద్రము నందు క్రీ.శ. 850 ప్రాంతములో వేంగిరాజధానిగా చేసుకొని పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ కురవి (కురవి అనగా గోరింటాకు లేదా ఎరుపు అని అర్ధము) నగరమును రాజధానిగా చేసికొని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్రస్వామివారి ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ప్రతీతి. తదనంతరము కాకతీయ తొలి స్వతంత్ర రాజైన ఒకటవ బేతరాజు జీర్ణోద్ధరణగావించినట్లు ఆ తర్వాత రెండవ బేతరాజు ఈ కురవి నగరమునకు ఆనుకొనియున్న పెద్ద తటాకమును త్రవ్వించినట్లు తెలియుచున్నది.
మహా పరాక్రమ వంతుడు :
సకలశక్తిమూర్తి వరాల ప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామివారు పడమటముఖుడై దశహస్తుడై త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతూ దక్షిణహస్తములలో ఒకటవ హస్తములో ఖడ్గము, రెండవ హస్తములో త్రిశూలము మూడవ హస్తములో పుష్పము, నాల్గువ హస్తములో గద, ఐదవ హస్తములో దండము, వామ హస్తములందు ఒకటవ హస్తములో ఢమరుకము, రెండవ హస్తములో సర్పము, మూడవ హస్తములో విల్లు, నాల్గువ హస్తములో బాణము, ఐదవ హస్తములో ముద్గరము ధరించి భక్తుల పాలిటకల్పతరువుగా, పిలిచిన పలికే దైవముగా వెలుగొందుచున్నాడు. సమస్తములైన భూత, ప్రేత, పిశాచ, గణాలు, శాకినీ, ఢాకినీ, కామినీ వంటి ప్రమధ గణ పిశాచాలు ఈయన అధీనము. రుద్రగణాలు ఈయనను సేవిస్తాయి. భక్తులకు విపత్కర సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో భక్తులను ఆదుకొనే పరమభోళామూర్తి. సమస్త క్షుద్రగణాలకు వీరభద్రుడంటే పరమ భయం. స్వామిని తలంచిన వారికి, సేవించిన వారికి పిశాచ బాధలు, సర్వదోషాలు, క్షుద్ర శక్తులు దరిజేరవు. శ్రీ స్వామివారి కుడివైపు కొద్ది సమీపములో విజయగణపతి వెలసియున్నాడు. శ్రీ స్వామివారి పాదముల క్రింద నందీశ్వరుడు శ్రీ స్వామివారి వాహనముగా వెలసియున్నారు. శ్రీ వీరభద్రస్వామివారి ఆయుధం పేరు పట్టేశం.
శ్రీ స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసియున్నారు. శ్రీ భద్రకాళీ అమ్మవారికి కుడివైపు మొదటి హస్తమున త్రిశూలం, రెండవ హస్తములో స్వల్పసిద్ధితో హృదయాన్ని స్పందింపచేయునట్లుగా సదా అభయమిస్తూ వామహస్తములలో మొదటి హస్తములో పద్మము, రెండవ హస్తముతో భువిని శాశ్వతముగా నిలుపుమని ఆశీర్వదించినట్లు దర్శినమిచ్చుచున్నది. శ్రీ స్వామివారి మండపములో సమాంతరముగా ఇరువైపుల పరమశివుడు (లింగాకారములో) వెలసియున్నాడు. మండపములో దక్షిణ భాగమున సప్తమాతృకలు వెలసియున్నారు.
ఈ ఆలయమునకు దక్షిణ దిశలో ప్రాకారము బయట శ్రీ భద్రకాళీ అమ్మవారు. స్వయంవ్యక్తమూర్తిగా వెలసి భక్తుల కోర్కెలను తీర్చి అనేక పూజలందుకొనుచున్నది.
కళ్యాణ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు.. పదహారు రోజుల పండుగ షెడ్యూల్..
25-2-2025 (మంగళవారం) :
ఉదయం 9-00 గంటలకు పసుపు కుంకుమలు..
ఆలయ పూజారి ఇంటి నుండి పసుపు కుంకుమలు మేళతాళాలతో రావడంతో జాతర పనులు ఆరంభం అవుతాయి
సాయంత్రం 7-00 లకు గణపతిపూజ, పుణ్యాహవచనము, పంచగవ్యప్రాశన, కంకణధారణ, దీక్షాధారణ, అంకురారోపణం, అఖండ దీపారధన, కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం.
రాత్రి 10-00 గంటలకు లకు బసవముద్ద
26-2-2025 (బుధవారం) :
మహాశివరాత్రి- ఉదయం 4-00ల నుండి శ్రీ స్వామివారి దర్శనము.
ఉదయం 4-00 గంటల నుండి సాయంత్రం 4-00 గంటల వరకు శ్రీస్వామివారికి పూర్ణాభిషేకం,
సాయంత్రం 4-00 గంటల నుండి శ్రీ స్వామివారు అలంకారముతో దర్శనము, పాదాభిషేకము, శివాలయము నందు
ఉదయం5-00 గంటల నుండి, రాత్రి12-00 గంటల వరకు శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామివారికి అభిషేకములు నిర్వహించబడును.
సాయంత్రం 7-00 గంటలకు గ్రామసేవ, ఎదురుకోలు.
రాత్రి గం 12-30 లకు (తెల్లవారితే గురువారం) శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణమహోత్సవము,
27-2-2025 , 28-2-2025 (గురువారం నుంచి శుక్రవారం వరకు) :
ప్రతి నిత్యము ఉదయం 6-00 గంటలకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహరణ..
సాయంత్రం 6-00 గంటలకు హోమము, సేవలు, గ్రామసేవ
01-3-2025 (శనివారం) :
ఉదయం 6-00గంటల నుండి 12-00 గంటల వరకు అభిషేకములు
సాయంత్రం 6-30 గంటలకు తెప్పోత్సవము (కురవి పెద్ద చెఱువు నందు)
03-3-2025 (సోమవారం) :
ఉదయం 6-00 గంటలకు అభిషేకములు, నిత్యౌపాసన, బలిహరణ
సాయంత్రం 6-00 గంటలకు రధోత్సవము.
04-3-2025 (మంగళవారం) :
ఉదయం 10-30 గంటలకు పూర్ణాహుతి.
సాయంత్రం 4-00 గంటలకు బండ్లు తిరుగుట, పారువేట.
రాత్రి 10-00 గంటలకు ద్వజ అవరోహణ, బసవముద్ద.
05-3-2025 (బుధవారం):
తెల్లవారుజామున 5-00 గంటలకు దోపోత్సవము.
ఉదయం 8-00 గంటలకు వసంతోత్సవము,
ఉదయం 11-00 గంటలకు కురవి పెద్ద చెరువు నందు త్రిశూలస్నానం,
సాయంత్రం 7-00 గంటలకు ఏకాంత సేవ, సదస్యం నాగవెల్లి.
06-3-2025 (గురువారం) :
ఉదయం 6-00 గంటల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు అభిషేకములు.
సాయంత్రం 6-30 గంటలకు శ్రీ స్వామివారి పవళింపు సేవ.
10-3-2025 (సోమవారం) :
ఉదయం 7-00గంటలకు శివాలయములో మహన్యాస పూర్వక రుద్రాభిషేకము, రుద్రహోమము,
ఉదయం 11-30 గంటలకు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణమహోత్సవము
12-3-2025 (బుధవారం) :
ఉదయం 6-00 గంటల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు పూర్ణాభిషేకములు
మధ్యాహ్నం 12-00 గంటల నుండి శ్రీస్వామివారి ఆలంకరణ.
జాతరకు సర్వం సిద్ధం : ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, ఆలయ ఈవో సత్యనారాయణ
ఈనెల 25వ తేదీ అంకురార్పణతో జరిగే కళ్యాణ బ్రహ్మోత్సవాల జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలు, భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మేడారం జాతర లేకపోవడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు.
అందుకు తగ్గట్టుగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో, సహకారంతో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ అధికారుల సహకారంతో సంత(అంగడి) ఆవరణాన్ని పూర్తిగా చదును చేసి భక్తులకు వాడుకలోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ కాలువ రోడ్డుకు మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మరింత మెరుగైన సదుపాయాలను సమకూర్చినట్లు తెలియజేశారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి