జూబ్లీహిల్స్, మార్చి 1: నగరంలో నకిలీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. లైసెన్స్ లేకుండా ఏజెన్సీల ముసుగులో నేరప్రవృత్తి కలిగిన యువతీ యువకులు హౌస్ కీపింగ్, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులుగా హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. యజమానులను నమ్మించి నిలువునా మోసం చేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో మదన్ అనే ఏజెంట్ ద్వారా వంట మనిషిగా చేరిన నేపాల్‌కు చెందిన భూపేందర్ షాహీ అనే వ్యక్తి ఇంటి యజమానులు బయటకువెళ్లగానే తోటి పనివాళ్లకు మత్తుమందు ఇచ్చి వారిని బంధించి భారీగా బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే.
మాజీమంత్రి జానారెడ్డి కోడలు బంజారాహిల్స్‌లో నిర్వహిస్తున్న అనుశ్రీరెడ్డి స్టోర్‌లో హౌస్ కీపింగ్ పనిచేస్తున్న అస్సాంకు చెందిన అమీనుల్ హక్ (38) అనే వ్యక్తి స్టోర్ లాకర్లో ఉన్న రూ.2.43 లక్షల నగదును దొంగిలించాడు. అస్సాం, బిహార్, ఒడిశా, నేపాల్ తదితర ప్రాంతాల నుంచి నేరప్రవృత్తి కలిగిన యువతీ యువకులు నగరంలో నకిలీ ఏజెన్సీల మాటున ఆశ్రయం పొందుతున్నారు. అందరినీ నమ్మించి అవకాశం దొరకగానే అందినకాడికి దోచుకుపోతున్నారు. అత్యం త నమ్మకంగా పనుల్లో చేరి యజమానులకు మత్తుమందు ఇచ్చి.. వారి నోటికి ప్లాస్టర్లు వేసి బంధించి.. అన్నం పెట్టిన వారి ఇంటికే కన్నం పెడుతూ.. అవసరమైతే ప్రాణాలు తీసి మరీ దోచుకెళ్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఈ తరహా దోపిడీలు చేస్తున్న వారికి నకిలీ ఏజెన్సీల ద్వారా పనులు సంపాదించడం చాలా సులువుగా మారిపోయింది. ప్రదానంగా ఏజెన్సీల మార్గదర్శకాల అమలు చూసేవారు చూసీచూడనట్లు ఉండడంతో నకిలీ ఏజెన్సీలది ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. దీంతో నగరంలో నకిలీ, లైసెన్స్‌లు లేని ఏజెన్సీల ద్వారా ఆయా రంగాల్లో ఉపాధి పొందుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, గంజాయి చాక్లెట్ల సరఫరా.. ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పా ల్పడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నిబంధనల ప్రకారం ప్రతి ఏజెన్సీకి ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్’ లైసెన్స్ విధిగా ఉండాలి. ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీ యజమానికి రాష్ట్ర హోం శాఖ పరిధిలోని ఇంటిలీజెన్స్ సెక్యూరిటీ వింగ్ 5 రోజుల శిక్షణ ఇస్తుంది. ఆయా సంస్థలు పుర, నగర పాలక సంస్థల నుంచి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్, ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లు, కా ర్మిక శాఖ నుంచి లేబర్ లైసెన్స్, బిజినెస్ లైసెన్స్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేటర్ అఫైర్స్ సర్టిఫికెట్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐఎస్వో, బీఎస్ఈ సర్టిఫికెట్లు, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొ ందాల్సి ఉంటుంది.
అంతేకాకుండా నేమ్ ట్రేడ్ లైసెన్స్, లోగో ట్రేడ్ లైసెన్స్, పాన్ నెంబర్, టిన్ నంబర్, జీఎస్టీ నంబర్లతోపాటు నగరంలో ఖచ్చితంగా సంబంధిత కార్యాలయాన్ని కలిగి ఉండాలి. అయితే నగరంలో నడుస్తున్న వందలాది ఏజెన్సీలు నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతుండడం గమనార్హం. పలు సంస్థలకు సరైన అనుమతులు, కార్యాలయాలు లేకపోవడం.. ఆయా సంస్థల ద్వారా పనుల్లో చేరుతున్న వారి కనీస ధృవీకరణ పత్రాలు కూడా పరిశీలించకపోవడంతో నగరంలో పెరిగిపోతున్న నేరాలకు ఆయా ఏజెన్సీలు కేంద్ర బిందువుగా మారిపోతున్నాయి.
అయితే ఏదైనా సంఘటన జరిగినప్పుడు తమ మీదకు రాకుం డా చూసుకోవడంలో కూడా ఆయా ఏజెన్సీ నిర్వాహకులు సిద్ధహస్తులుగా ఉండడంతో అవి అప్పటికప్పుడు సమసిపోతున్నాయి. వివిధ రాష్ర్టాల నుంచి ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా వచ్చిన వారు ఇప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీలను నడుపుతున్నారని, వందలాది ఏజెన్సీలకు హైదరాబాద్‌లో కార్యాలయాలు కూడా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఈగిల్ ఐ సెక్యూరిటీ సంస్థ ఎండి బి.కృష్ణమోహన్ సీఎంకు , రాష్ట్రపతికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు.