సంగారెడ్డిలో రూ.50 కోట్ల విలువైన భూమికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎసరు పెట్టింది. పేదలకు కేటాయించిన భూమిని అడ్డదారిలో సొంతం చేసుకుని రియల్ వెంచర్ వేసేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇది తెలిసిన పేదలు తమ భూమిని దక్కించుకునేందుకు పోరుబాట పట్టారు. పోలీసుల అండతో రియల్ ఎస్టేట్ సంస్థ తాము ఆక్రమించుకున్న స్థలంలోకి పేదలు రాకుండా అడ్డుకుంటోంది. అధికార పార్టీ నేత దన్నుతో రియల్ ఎస్టేట్ సంస్థ మరో 8 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అధికారులు, అధికార పార్టీ నేత తీరుతో పేదలకు అన్యాయం జరుగుతున్నది.
సంగారెడ్డి, మార్చి 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో ఎకరం భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. జాతీయ రహదారి పక్కగానే భూములు ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇక్కడి అసైన్డ్, ప్రభుత్వ భూములపై రాజకీయనాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో కోట్ల రూపాయల విలువైన అసైన్డ్, ప్రభుత్వ భూములను అడ్డదారుల్లో దక్కించుకుని పాట్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

రూ.50 కోట్ల విలువ చేసే భూమికి టెండర్
పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి పక్కగానే ఉన్న రూ.50 కోట్లకు పైగా విలువైన 2.05 ఎకరాల పేదల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించుకుంది. పోతిరెడ్డిపల్లిలోని సర్వేనెంబరు 153, 153/4 సర్వే నెంబర్లోని పది ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని భూమిలేని ఎస్సీ, బీసీలకు గతంలో కేటాయించారు. ఇందులో పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి పక్కనే ముగ్గురి పేరిట 2.05 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఇల్లు లేని పేదలకు కేటాయించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముగ్గురు అసైనీలకు డబ్బులు చెల్లించి సంగారెడ్డి ఆర్డీవో 2.05 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలో తీసుకున్నారు. అనంతరం 2.05 ఎకరాల భూమిని 80 మంది పేదలకు ఇండ్ల స్థలాల కోసం 2007లో పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరికి ఇండ్ల నిర్మాణం కోసం 80 గజాల చొప్పున 2.05 ఎకరాల భూమిని 80 మందికి ఇండ్ల పట్టాలు అందజేశారు. అప్పడు సరైన రోడ్డు లేకపోవటంతో పట్టాదారులు వెంటనే ఇండ్లు నిర్మించుకోలేదు. 2011-12లో రెవెన్యూ అధికారులు పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లో ఇండ్లు కేటాయించక పోవడంతో ఇండ్ల పట్టాలను రద్దుచేసి, తిరిగి 2.05 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు 2.05 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి అడ్డదారిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించారు. రెవెన్యూ అధికారులతో ఎన్ఓసీ సైతం జారీ చేయించినట్లు తెలిసింది.
పోతిరెడ్డిపల్లి నుంచి కలివేముల వరకు ప్రభుత్వం కొత్తగా 60 ఫీట్ల రోడ్డు నిర్మిస్తుండడంతో ప్రస్తుతం ఈ భూమికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థ పక్కనే మరింత భూమిని కొనుగోలు చేసి వెంచర్ వేస్తున్నది. ఎన్వోసీ దక్కించుకున్న 2.05 ఎకరాల భూమిలో సైతం ప్లాట్లు చేస్తోంది. ఇది తెలుసుకున్న ఇండ్ల పట్టాలు ఉన్న 80మంది పేదలు ప్లాట్లు చేయడానికి వీలులేదంటూ గొడవకు దిగారు. రియల్ ఎస్టేట్ సంస్థ పోలీసుల అండతో బాధితులను అక్కడి నుంచి బలవంతంగా పంపించివేసి, వెంచర్ పనులను యథావిధిగా కొనసాగిస్తున్నది.
తమకే కేటాయించి ఇండ్ల స్థలాల భూమి రద్దు చేసినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రచారం చేసి, తమ భూమిని అక్రమించుకున్నాడని బాధితులు ఆరోపించారు. ఆ భూమిని తమకు అప్పగించే వరకు పోరాటం చేస్తామని బాధితులు తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు. ఈ భూమి విషయమై వివరణ కోరేందుకు సంగారెడ్డి మండల రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు.
మరో 8 ఎకరాలు రియల్ ఎస్టేట్ సంస్థకు దఖలు?
పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించిన 2.05 ఎకరాల భూమిని కైవసం చేసుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ, మరో ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూమిని అడ్డదారిలో సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్ చేస్తున్న సమీపంలోని ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూమి రియల్ ఎస్టేట్ సంస్థకు అధికార పార్టీ నాయకుడి అండతో సొంతం చేసుకుని ఎన్వోసీ సాధించినట్లు తెలిసింది. వెంచర్ పూర్తయితే ఇక్కడ గజం ధర రూ.30 నుంచి రూ.40వేల వరకు పలికే అవకాశాలు ఉన్నాయి.