Sircilla | రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లలో రాజకీయ ఆరోపణల మధ్య చోటుచేసుకున్న నేత కార్మికుడి మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఓ నేత కార్మికుడి హత్యను అడ్డుపెట్టుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్‌ను ఇరికించేందుకు కుట్ర జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాను హత్య చేస్తే ఆ నేరాన్ని వైస్ చైర్మన్‌పై నెట్టేయొచ్చన్న ఉద్దేశంతోనే వెంకటేశంను హత్య చేసినట్లు నిందితుడు కుసుమ గణేష్ వెల్లడించినట్టు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. కేసులో గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. వైస్ చైర్మన్‌పై ఆరోపణలు చేసిన వ్యక్తే హత్యకు గురికావడం, అనంతరం మృతదేహంతో ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు యత్నించడం, తీరా పోలీసుల దర్యాప్తులో హత్య వెనుక మరో కోణం బయటపడటం సిరిసిల్లలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగారంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్‌పై నేత కార్మికుడు వెంగల వెంకటేశం ఇటీవల ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే ఈ నెల 8న వెంకటేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వెంకటేశం మృతదేహాన్ని వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు హంగామా చేశారు. పోలీసులు, ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇంతలోనే వెంకటేశం హత్యకు గురయ్యాడని పోలీసుల దర్యాప్తులో తేలడం సిరిసిల్లలో సంచలనం రేపింది. వెంకటేశం పనిచేస్తున్న యజమాని కుసుమ గణేష్ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. వైస్ చైర్మన్ దార్ల సందీప్‌పై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. తాను చేసిన హత్యను ఆయనపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే వెంకటేశాన్ని చంపేసినట్లు నిందితుడు చెప్పినట్లు తెలిపారు.
నిందితుడి ఉద్దేశం, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు. కాగా గణేష్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులతో ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దార్ల సందీప్‌పై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత గాజుల లక్ష్మణ్‌తో పాటు పోసు రమేశ్, పసునూరి సూర్యప్రకాశ్, మరో వ్యక్తితో గణేశ్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సంబంధాలపై మరింత విచారణ కొనసాగుతుందని చెప్పారు.
కాగా, సిరిసిల్లలో సందీప్‌పై కుట్రలు, హత్యా రాజకీయాలు వెలుగులోకి రావడంతో అధికార పార్టీపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.