న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ జూలై 20వ తేదీన చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో విధ్వంసం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ర్యాలీ తీస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. ఆ సమయంలో పెల్లెట్ గన్స్(Pellets) వాడారు. అయితే పెల్లెట్స్ వల్ల సుమారు 10 మంది గాయపడినట్లు ఓ ఆర్టీఐ ఫిర్యాదు ద్వారా వెల్లడైంది. రెండు ఆస్పత్రులు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాయి. జూలై 20న జరిగిన పార్లమెంట్ మార్చ్ సమయంలో కనీసం 10 మందికి పెల్లెట్ గాయాలు అయినట్లు తెలిసిందని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు. తమ ఆస్పత్రిలో 9 మంది పెల్లెట్ గాయాలకు చికిత్స తీసుకున్నట్లు లేడీ హార్డింజే మెడికల్ కాలేజీ తన రిపోర్టులో తెలిపింది. ఇక సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో ఒకరు పెల్లెట్ గాయాలకు చికిత్స తీసుకున్నారు.
ఆర్టీఐ నివేదిక ప్రకారం.. పెల్లెట్ గాయాల గురించి ఎయిమ్స్, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రుల వివరాలు అందాల్సి ఉన్నది. పెల్లెట్ గన్స్ వాడకంపై తీవ్ర దుమారం రేగుతున్నది. ఢిల్లీ పోలీసులు మాత్రం తాము పెల్లెట్స్ వాడలేదని చెప్పారు. కానీ ఆర్పీఎఫ్ నేతృత్వంలోని ఆర్ఏఎఫ్.. బహుశా పెల్లెట్స్ వాడినట్లు అనుమానిస్తున్నారు. పెల్లెట్ గన్స్ అంశంలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సీజేపీ నిరసనకారులను అడ్డుకునేందుకు 55 రౌండ్ల నాన్ ఎలక్ట్రికల్ షెల్స్, 15 రౌండ్ల ఎలక్ట్రికల్ షెల్స్, 5 టియ్ గ్యాస్ గ్రేనేడ్లు, రెండు రౌండ్ల యాంటీ రాయిట్ గన్స్, రెండు రౌండ్ల ప్లాస్టిక్ పెల్లట్స్ ను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాడినట్లు తెలిసింది.