న్యూఢిల్లీ: భారత్‌కు 2022లో అమెరికా సుమారు 21 మిలియన్ల డాలర్ల నిధుల్ని( USAID Fund) మళ్లించినట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దానిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాటల యుద్ధం సాగిస్తున్నాయి. భారత్‌లో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు అమెరికా డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా ఆ డబ్బును తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ 21 మిలియన్ల డాలర్ల నిధుల్ని బంగ్లాదేశ్‌కు తరలించారని, ఇండియాకు కాదు అని బీజేపీ ఆరోపించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆ నిధులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్జీవోలకు దక్కినట్లు బీజేపీ పేర్కొన్నది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. బీజేపీ తమకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీయే అమెరికా నిధుల్ని వాడుకున్నదని, ఆ అంశాన్ని దారిమళ్లించేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. 21 మిలియన డాలర్ల నిధుల గురించి ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆ అంశాన్ని గుర్తు చేశారు. అదో కిక్‌బ్యాక్ స్కీమ్ అని పేర్కొన్నారు. మన దగ్గరే సమస్యలు ఉంటే, ఇండియా ఎన్నికల గురించి ఎందుకు ఆ నిధుల్ని ఇస్తున్నారని ట్రంప్ నిలదీశారు.
బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటిమా మాట్లాడుతూ.. భారత్ వ్యక్తిగత సార్వభౌమ దేశమని, మన అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు ఎందుకు జోక్యం చేసుకోవాలని, ప్రధాని మోదీని తప్పించేందుకు రాహుల్ గాంధీ విదేశీ సాయం కోరినట్లు ఆరోపించారు. వాళ్లు తమ స్వంత శక్తితో మోదీని ఓడించలేరని, అందుకే వాళ్లు విదేశీ శక్తుల్ని ఆశ్రయిస్తున్నారని, మోదీని విమర్శించే క్రమంలో, వాళ్లు భారత్‌నే ద్వేషిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరో వైపు కాంగ్రెస్ నేత పవన్ ఖారా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఆయన సమర్ధించుకున్నారు. అమెరికా డెవలప్మెంట్ ఏజెన్సీతో గతంలో బీజేపీ నేత స్మృతి ఇరానీకి సంబంధాలు ఉండేవన్నారు. యూఎస్ఏఐడీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్మృతి ఇరానీ ఉన్నారని, ఆమె నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేదని, ఆ నిరసనలకు అమెరికానే ఫండింగ్ ఇచ్చిందా అని ఖేరా ప్రశ్నించారు. 21 మిలియన్ల డాలర్లు ఇండియాకు వస్తే, అప్పుడు అజిత్ దోవల్, ఐబీ, రా ఎక్కడ ఉన్నట్లు ఆయన క్వశ్చన్ చేశారు.