Sand illegal Mining | మల్హర్, మార్చి 01 : అటవీ సంపదను కాపాడాల్సిన ఫారెస్టు సిబ్బందే చూసి చూడనట్టు ఉంటున్నారా..? వన్యప్రాణుల వేటకు ఏర్పడిన ముఠాలకు సహకరిస్తున్నదెవరు..? ఈ ప్రశ్నలకు సమాధానంగా మాత్రం.. కంచె చేను మేస్తుందా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమాను తలపించే రీతిలో ఇక్కడి అడవిలో పెద్ద దందానే జరుగుతున్నట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో కాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించడం, అంతేగాక శాత్రాజులపల్లి, కాపురం, తాడిచెర్ల శివారులోని దట్టమైన అడవుల్లో వన్యప్రాణుల వేట కోసం ఏకంగా నాలుగు ముఠాలు తయారవడం చూస్తుంటే.. అటవీ శాఖ సిబ్బందిపైనే ఆరోపణలు వస్తున్నాయి.
రాత్రి పూట అడవుల్లోకి వెళ్లి..
మానేరు నది నుంచి ఇసుకను తోడి అడవి మార్గంలో భూపాలపల్లికి తరలిస్తున్న ఇసుకాసురులకు అటవీ సిబ్బంది అండదండలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఇసుక ట్రాక్టర్ యజమానుల నుంచి నెలనెలా మామూళ్లు పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మామూళ్లు ఇవ్వకపోతే అడవిలో నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
మామూళ్లు ఇచ్చిన వారికి క్లియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అడవిలో నుంచే పెద్ద మొత్తంలో ఇసుకను తరలిస్తున్నట్లు గ్రామస్థులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇదొక్కటే కాకుండా ఇక శాత్రాజుపల్లి, కాపురం గ్రామాల పరిసర ప్రాంతాలు పూర్తిగా దట్టమైన అడవులు కాగా, ఆటవీ జంతువులను వేటాడేందుకు ఏకంగా మూడు నుంచి నాలుగు ముఠాలు ఏర్పడినట్లు తెలిసింది.
ఈ ముఠాలు వేర్వేరుగా రాత్రి పూట అడవుల్లోకి వెళ్లి టార్చిలైట్ల సాయంతో వన్యప్రాణులకు కరెంటు ఉచ్చులు పెట్టి అందులో పడిన అడవి జంతువులను తెల్లారేలోగా గ్రామాలకు తరలించి మాంసంను విక్రయిస్తుండటం పరిపాటిగా మారింది.
అడవిలోకి ఎప్పుడు వెళ్లేది..?
ఐతే ఈ ముఠాలు అడవిలోకి ఎప్పుడు వెళ్లేది..? ఎటు వైపు వెళ్లేది…? ఏ సమయంలో అడవిలో నుంచి బయటకు వస్తారనేది..? సమాచారం అటవీ శాఖ సిబ్బందికి తెలియదా..? లేక తెలిసే వారికి సహకరిస్తున్నారా..? అన్నదానిపై అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ సంపదను కాపాడాల్సిన సిబ్బందే మామూళ్లకు ఆశపడి వన్య ప్రాణులను పట్టుకునేందుకు వేటగాళ్లకు సహకరిస్తున్నారని గ్రామాల్లో చర్చ జరుగుతుంది.
ఒకవేళ ఉన్నతాధికారుల తనిఖీలు ఉన్నప్పుడు సదరు ముఠాల సభ్యులకు ముందుగానే అటవీ సిబ్బంది నుంచి సమాచారం వెళ్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వేటగాళ్లు ఆ రోజు అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. మళ్లీ సిబ్బంది నుంచి క్లియరెన్స్ వచ్చాకే వేటకు వెళ్తారని చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా మండలంలోని కాపురం అడవుల్లో పుష్ప సినిమాని తలపించేలా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు