నిడమనూరు, మార్చి 1: నల్లగొండ జిల్లా నిడమనూరు (Nidamanur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. శనివారం ఉదయం త్రిపురారం మండలం కోమటిగూడెంకు చెందిన మహిళా కూలీలు వ్యవసాయ పనుల కోసం ఆటోలో హాలియా వైపు వెళ్తున్నారు. వేంపాడు స్టేజి సమీపంలోని మూలమలుపు వద్ద లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన ఆటో లోతట్టు ప్రదేశంలోకి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న పదిమందికి గాయాలు అయ్యాయి.అక్కడున్న రెండు చెట్ల మధ్య ఆటో ఇరుక్కుపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిమితికి మించి కూలీలు ప్రయాణించడం వల్లే ఆటో అదుపుతప్పినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.