పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు, కలెక్టర్ మధ్య పంచాయితీ అగ్గిరాజుకుంటున్నది. నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళన దిశగా ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన 96 మంది బదిలీల అంశం వివాదస్పదమవుతున్నది. తమను అన్యాయంగా బదిలీ చేశారంటూ డిప్యూటీ ఈఓ (డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు), డిప్యూటీ ఐఓఎస్(డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్)లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చేసిన తప్పులకు అందరినీ బలి చేయడం ఏంటని కలెక్టర్ చర్యలను ఖండిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రోద్భలంతో డిమాండ్ ఉన్న ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చారని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. మరోవైపు బదిలీలను నిరసిస్తూ ఉపాధ్యాయులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. డీఈఓను కలిసినా ఫలితం లేకపోవడంతో నేరుగా కలెక్టర్‌ను కలిసి బదిలీలను రద్దుచేయాలని వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
– సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ)
తప్పుచేసిన వారిని బదిలీ చేశారంటే సబబే కానీ ఏ తప్పూ చేయని తమనెందుకు బదిలీ చేశారంటూ కొంతమంది డిప్యూటీ ఈఓ, ఐఓఎస్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపైన ఆరోపణలు వచ్చాయో వారికి ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయడం వెనుక ఉన్న మర్మం కలెక్టర్‌కే తెలియాలని నిలదీస్తున్నారు. మరోవైపు ఏడాది లోపున ఉన్న అధికారులను కూడా బదిలీ చేయడం, అది కూడా ప్రాధాన్యత లేని ప్రాంతానికి బదిలీ చేయడం వెనుక రాజకీయ ప్రోద్భలం ఉందని వాపోతున్నారు.
కొందరు కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్‌లు దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లు అధికంగా ఉన్న మండలాలు, కార్యాలయాలలోని కీలక సెక్షన్లలో పోస్టింగ్‌లకు భారీగానే డిమాండ్ పలికినట్టు సమాచారం. బండ్లగూడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఘటనలో పై స్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉందనే అనుమానంతో విచారణ జరుగుతున్నది. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు, పునరుద్ధ్దరణ, అగ్నిమాపక భద్రత, భవన సామర్ధ్యం వంటి నిబంధనల్లో లోపాలున్నా వాటిని సరిదిద్దకుండా మామూళ్లు తీసుకుని వాటిని క్లియర్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తప్పుచేసిన వారిపై వేటుపడాలే గానీ ఏ తప్పు చేయని వారిని ఎందుకు బదిలీ చేశారంటూ ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి.
నలిగిపోతున్న విద్యార్థులు ..
పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా ప్రతీ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో వెనకబడుతూనే ఉంది. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల కరువుతో కొట్టుమిట్టాడుతుంటే తాజాగా బదిలీల రచ్చతో పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బదిలీ అయిన వాళ్లంతా తమను అన్యాయంగా బదిలీ చేశారంటూ కలెక్టరేట్ చుట్టు తిరుగుతున్నారు. మరోవైపు పాఠశాల పర్యవేక్షణ ఒక ప్రాంతంలో, బదిలీ కారణంగా విధులు మరో ప్రాంతంలో చేయాల్సి వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి విద్యార్థులను పట్టించుకునే వారు కరువయ్యారు. వారి పరీక్షల సన్నద్ధతను గాలికొదిలేస్తున్నారు. కలెక్టర్ బదిలీ అంశానికి చెక్ పెట్టకపోతే పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.