IND vs China : భారత సరిహద్దు (India Boarder) కు సమీపంలో చైనా (China) తన సైనిక కదలికలను మరోసారి ముమ్మరం చేసింది. తన అత్యాధునిక ‘జే-20’ ‘మైటీ డ్రాగన్’ స్టెల్త్ ఫైటర్ జెట్ల (Fighter Jets) లో కనీసం 11 విమానాలను భారత్‌కు సమీపంలోని రెండు కీలక వైమానిక స్థావరాల్లో (AIR Bases) మోహరించారు. జూన్ చివరి వారం, జూలై ప్రారంభంలో చేపట్టిన ఈ మోహరింపులకు సంబంధించిన వివరాలు కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి.
జూలై 9వ తేదీ నాటి ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. జిన్జియాంగ్లోని హోటన్ ఎయిర్‌బేస్‌లో ఏడు జే-20 జెట్లు ఒకేచోట మోహరించి ఉన్నాయి. ఈ వైమానిక స్థావరం లడఖ్‌లోని లేహ్‌కు 389 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. భారత వాయుసేనకు వ్యూహాత్మకంగా కీలకమైన దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్‌ఫీల్డ్‌కు కేవలం 245 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకే స్థావరంలో ఇన్ని జే-20 జెట్లు కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు టిబెట్‌లోని డామ్క్సంగ్ ఎయిర్‌బేస్‌లో మరో నాలుగు జే-20 జెట్లను గుర్తించారు.
ఈ స్థావరం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు సుమారు 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పరిణామాలపై మాజీ ఫైటర్ పైలట్ సమీర్ జోషి విశ్లేషిస్తూ.. ‘ఎత్తయిన పీఠభూమి ప్రాంతాల్లో ఐదో తరం ఫైటర్ జెట్లను నడపడం చైనా వాయుసేనకు ఇప్పుడు ఒక సాధారణ ప్రక్రియగా మారింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. భారత వాయుసేన ఇకపై ఉత్తర సరిహద్దులో స్టెల్త్ విమానాల ముప్పును ఒక ప్రామాణిక సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌంటర్-స్టెల్త్ సెన్సార్లు, సమీకృత వాయు రక్షణ వ్యవస్థల అవసరం ఎంతైనా ఉంది’ అని పేర్కొన్నారు.