NEET Protest : సీజేపీ ఆందోళన సందర్భంగా గాయపడ్డ యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఆస్పత్రి యాజమాన్యం ప్రకటన చేసింది. జూలై 20న ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇటు విద్యార్థులు, ఉద్యమకారులతోపాటు పోలీసులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 65 మంది వరకు విద్యార్థులు గాయపడగా, 130 వరకు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
వీరిలో 21 ఏళ్ల ఒక విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. ఆమెకు ఢిల్లీలోని ఆర్ఎంఎల్ (డాక్టర్ రామ్ మనోహర్ లోహియా) ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆర్ఎంఎల్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటన చేసింది. ఆమెకు ప్రస్తుతం వెంటిలేటర్ తొలగించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తను సొంతంగానే శ్వాస తీసుకుంటోందని, నెమ్మదిగా కోలుకుంటుందని తెలిపింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించింది. తీవ్రగాయాలపాలైన ఆమెకు మొదట వెంటిలేటర్ ద్వారా వైద్యం అందించారు. ఐదు రోజుల క్రితమే వెంటిలేటర్ తీసేసినట్లు ఆస్పత్రి తెలిపింది. ప్రస్తుతం ఆమె స్పృహలోనే ఉందని, తమ సూచనలకు స్పందిస్తోందని ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజులుగా ఆమెకు నోటి ద్వారా ఆహారం అందిస్తున్నామని, నిరంతరం యువతి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.
వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యబృందం అవసరమైన చికిత్స అందించి, కోలుకునేలా చేస్తున్నారని తెలిపింది. ఇక, సీజేపీ ఆందోళనల్లో పాల్గొని గాయాలపాలైన ఇతరులకు కూడా చికిత్స అందుతోంది. ఈ ఆందోళనలు, హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 15కుపైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సమాచారం. జంతర్‌మంతర్ వద్ద ఇప్పటికీ రోజుకు 10,000 మంది వరకు గుమిగూడుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదే సమయంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం చెలరేగకుండా ఉండటానికి 3,000 మంది భద్రతా సిబ్బంది నిరంతరం అక్కడ పని చేస్తున్నారు.