Haryana : హరియాణాలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ ప్రాణం పోయింది. కాలు విరిగిందని ఆస్పత్రిలో చేరిన మహిళకు వైద్యులు హార్ట్ సర్జరీ చేశారు. అది కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే. సర్జరీ అనంతరం ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హరియాణాలోని పానిపట్‌లో జరిగింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గుడ్డి దేవి అనే మహిళ హరియాణాలోని రమేష్ నగర్లో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమె ఈ నెల 24న రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె కాలు విరిగింది.
దీంతో ఆమెను చికిత్స కోసం పానిపట్‌లోని జీటీ రోడ్డులో ఉన్న పార్క్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆమె గుండెకు సర్జరీ చేసి, స్టంట్స్ వేసినట్లు మరుసటి రోజు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే, ఈ సర్జరీ గురించి ముందుగా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. వారి అనుమతి కూడా తీసుకోలేదు. శస్త్రచికిత్స పూర్తైన తర్వాతే కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పారు. అయితే, సర్జరీ అనంతరం గుడ్డి దేవి చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై గుడ్డి దేవి తనయుడు కుల్దీప్ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆస్పత్రి యాజమాన్యం తమతో చెప్పినట్లు కుల్దీప్ మీడియాకు వివరించారు. వైద్యుల నిర్లక్ష్యంపై కుల్దీప్ పానిపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బీఎన్ఎస్ సెక్షన్స్ 106, 318 (4), 351 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గుడ్డిదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరమే ఆమె మరణానికి గల కారణం తెలుస్తుందని, ఆపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.