INDIA Bloc : ఓటర్ల జాబితా (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా డిమాండ్ నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) ఇవాళ ఢిల్లీ (Delhi) లో సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం (Union Govt), ఎన్నికల సంఘం (Election Commission) పై ఉమ్మడి పోరుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 13 కోట్ల పేర్లను అక్రమంగా తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌లోనే అంతర్గత విభేదాలున్నాయని, ఇద్దరు కమిషనర్లు పలుమార్లు అభ్యంతరాలు తెలిపారని మీడియా కథనాలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని కూటమి డిమాండ్ చేస్తోంది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీతోపాటు తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, వామపక్షాలు, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) నేతలు పాల్గొంటున్నారు. సీఈసీని తొలగించేందుకు పార్లమెంటు ఉభయసభల్లో కొత్తగా అభిశంసన నోటీసు ఇవ్వడం, దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టడం వంటి అంశాలపై చర్చించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ కీలక సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూరంగా ఉంటున్నాయి.