బీబీనగర్, మార్చి 3 : ‘మళ్లీ జన్మంటూ ఉంటే కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటా డాడీ.. అమ్మాయిగా మాత్రం అస్సలు పుట్టను.. ప్రతి ఒక్కరూ అత్తగారింటికి పోతలేవా అంటే నా మనసు సచ్చిపోతోంది.. నా చావుకు, నా పిల్లల చావుకు నా భర్త మేకల మహేశ్, అత్తమామలు మేకల నర్సింహ, మేకల సత్తమ్మలే కారణం.. వారికి జీవిత శిక్ష పడేలా చూడాలి’ అని సూసైడ్ నోట్ రాసిన ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గొల్లగూడెంకు చెందిన మేకల మహేశ్యాదవ్కు వలిగొండ మండలం వేములకొండకు చెందిన ఐశ్వర్య(28)తో 2020లో వివాహమైంది. వీరికి ఝాన్సీ (3), పండు (10 నెలలు) వయసుగల ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గత కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మహేశ్ తన భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, వివాహేతర సంబంధాలు కొనసాగించడంతో పదినెలలుగా ఐశ్వర్య పుట్టింట్లోనే ఉంటున్నది. మహేశ్ ఇటీవల ఫోన్‌చేసి ఇంటికి రావాలని చెప్పడంతో సోమవారం ఐశ్వర్యను పెదనాన్న, పెద్దమ్మ ఇంటికి తీసుకొచ్చి వదిలివెళ్లారు. మంగళవారం ఉదయం మహేశ్ తల్లి లేచి ఐశ్వర్య గదిలోకి వెళ్లి చూడగా పిల్లలను చంపి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాలకు పంచనామా చేపట్టి, భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మహేశ్, సత్తమ్మ, నర్సింహను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భర్త, అత్త మామలను కఠినంగా శిక్షించాలి..
తన భర్త, అత్త మామలను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐశ్వర్య సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. భర్త, అత్తమామలు తనను, పిల్లలను ఏనాడూ సరిగాచూడలేదని, తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనే భయంతో పిల్లల్ని కూడా తీసుకెళుతున్నానని, తనను తల్లిదండ్రులు క్షమించాలని కోరిందని పేర్కొన్నారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటా డాడీ, అమ్మాయిగా మాత్రం అస్సలు పుట్టను, మా ముగ్గురి మృతదేహాలను బాయికాడ రేగుచెట్టు కింద ఒకే దగ్గర బొందపెట్టు.. ప్రతి రోజూ నిన్ను చూడకుండా ఉండలేను డాడీ.. ప్రతి ఒక్కరూ అత్తగారింటికి పోతలేవా అంటే నా మనసు సచ్చిపోతోంది. నా చావుకు, నా పిల్లల చావుకు నా భర్త మేకల మహేశ్, అత్తమామలు మేకల నర్సింహ, మేకల సత్తమ్మలే కారణం, వారికి జీవితాంతం శిక్ష పడేలా చూడాలి’ అని లేఖలో పేర్కొందని పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యతో గ్రామంలో విషాదం నింపింది.