యాదగిరిగుట్ట, మర్చి1: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో శనివారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం జరిపారు. తొలిపూజల్లో ఆలయ ఆనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, ప్రధాన అర్చకులు నల్లన్తీఘల్ లక్ష్మీ నరసింహ చార్యులు, కాండూరి వెనకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ఈ నెల 11 వరకు జరుగనున్నాయి. 1 నుంచి 3 వరకు సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ‘నృసింహ వైభవం’ ఆధ్యాత్మిక ప్రవచనం, 9వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 7న స్వామివారి ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం, 11న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హో మం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దు చేశారు.