న్యూఢిల్లీ, మార్చి 9 : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తొలగింపునకు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తీర్మానానికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని, ఈ వారంలోనే నోటీసు ఇచ్చే అవకాశముందని తెలిసింది. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా, ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని టీఎంసీ సీనియర్ ఎంపీ వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ముసాయిదా సిద్ధమైందని అన్నారు. ఒకేసారి రెండు సభల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
ఎన్నికల కమిషనర్ తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆ నాయకుడు ఆరోపించారు. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలన్నీ ఈ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఉన్నాయని, ముసాయిదా రూపకల్పనలో భాగస్వామ్యమైనాయని తెలిసింది. తీర్మానంపై అన్ని పార్టీల నాయకులు ఎంపీల సంతకాలను సేకరించనున్నారు. లోక్‌సభ నుంచి కనీసం 100, రాజ్యసభ నుంచి కనీసం 50 మంది సంతకాలు అవసరమని ఓ నాయకుడు తెలిపారు. పార్లమెంట్ ద్వారా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించేందుకు అనుసరించే విధానమే సీఈసీ తొలగింపునకు కూడా వర్తిస్తుందని అన్నారు.