Anti paper leak bill : దేశంలో పేపర్ లీకేజీలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్ లోక్‌సభలో పాసైంది. ప్రతిపక్షాల ఆందోళన మధ్య బుధవారం ఈ బిల్లు లోక్‌సభ సభ్యుల ఆమోదం పొందింది. ‘ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్, 2026కు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం లభించింది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు ఆందోళన చేసినప్పటికీ.. ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం.
బిల్లుకు సవరణలు చేయాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ.. కేంద్రం అదే బిల్లును సభలో ప్రవేశపెట్టింది. సోమవారం ఈ బిల్లు లోక్‌సభ ముందుకురాగా.. రెండు రోజులపాటు చర్చ జరిగింది. చివరకు బుధవారం ఓటింగ్ నిర్వహించగా, ఆమోదం లభించింది. కొత్త బిల్లు ప్రకారం పేపర్ లీకేజీకి పాల్పడితే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ కేసుపై విచారణ కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తారు. ఇందుకోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. మరోవైపు సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా గందరగోళం చోటు చేసుకుంది. విద్యార్థులపై కాల్పులు జరపమని ఆదేశించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షానే అంటూ రాహులు చేసిన ఆరోపణలు ఆందోళనకు దారితీశాయి. రాహుల్ తీరును కేంద్రం తప్పుబట్టింది.
కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జితేంద్ర సింగ్ సహా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అయితే, రాహుల్ ఈ ఆరోపణలు చేసిన సమయంలో అమిత్ షా సభలో లేరు. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్ వ్యవహారాలపై అవగాహన లేదని, ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలియదన్నారు. రెండేళ్లక్రితం యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 52 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.