MLA Ramachandra Naik | మరిపెడ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు అందజేస్తున్న ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణ లక్ష్మి, కాటమయ్య కిట్, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కొరకు డ్వాక్రా గ్రూపుల వద్ద ఒక లక్ష వరకు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం, లేదా ఇంటి పత్రాలు సరిగా ఉంటే బ్యాంకుల వద్ద కూడా ఇంటి నిర్మాణానికి అప్పు తీసుకోవచ్చు. కానీ లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఉంటేనే బ్యాంకులో అప్పు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నరసింహులు, తహసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో విజయ, ఎంఈఓ గాదే అనిత దేవి, ఆర్ఐ శరత్ చంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన పాటించని ఎమ్మెల్యే
మండలంలోని కళ్యాణ లక్ష్మి, కాటమయ్య కిట్, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడానికి మండల కేంద్రంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమకై మధ్యాహ్నం 12 గంటలకు లబ్ధిదారులకు సమయం ఇవ్వడంతో లబ్ధిదారులు సమయానికి ఆడిటోరియానికి చేరుకొని ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజన సమయం అవుతున్న ఎమ్మెల్యే రాకపోవడం, మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు ఎమ్మెల్యే రావడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు.
Read More>>