సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): డబ్బులు తన దగ్గర దాచిపెట్టుకోమన్న పాపానికి ఆ డబ్బులను ఓవ్యక్త దోచేశాడు. గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ జకీర్ తన అల్లుడు కబీర్‌కు ప్లాట్ కొనేందుకు కావాల్సిన డబ్బులు రూ. 29 లక్షల నగదు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయంపై జకీర్ తన కొడుకు ఇలియాస్ మాట్లాడుకొని తమ బంధువైన ఓబేద్ ద్వారా ఆ డబ్బును కబీర్‌కు పంపించారు. ఓబేద్ డబ్బులు తీసుకొని వెళ్తున్న సమయంలోనే కబీర్ నగరంలో లేడనే సమాచారం వచ్చింది.
దీంతో ఆ డబ్బును ఎర్రకుంటలో నివాసముండే ఇలియాస్ స్నేహితుడైన ఖదీర్‌కు అప్పజెప్పాలని ఓబేద్కు సూచించారు. ఓబేద్ను ఖదీర్‌తో మాట్లాడించాడు. డబ్బులు తన వద్ద దాచిపెట్టుకోవడానికి ఖదీర్ ఒప్పుకోవడంతో వాటిని అతడికి అప్పగించేందుకు ఓబేద్ బయలుదేరాడు. దీంతో ఖదీర్‌కు ఆ డబ్బుపై కన్ను పడింది.. వెంటనే ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేసి విషయాన్ని తన మామ అయిన హబీద్ హరూన్‌కు వివరించాడు. డబ్బు కొట్టేసేందుకు చాంద్రాయణగుట్టకు చెందిన వర్దన్, రషీద్ ఖాన్, రషికాంత్ బర్దన్ అలియాస్ కిట్టులతో మాట్లాడారు. తాము చెప్పినట్లు ఒక వ్యక్తి వద్ద నుంచి డబ్బుల బ్యాగ్ కొట్టేస్తే ఒక్కొక్కరికీ రూ. 20 వేలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నారు.
దీంతో డబ్బులు తీసుకొని వస్తున్న ఓబేద్ ఎక్కడున్నాడు, ఎలా వస్తున్నాడనే విషయాలను ఖదీర్, మామ ఆరా తీస్తూ ఆ విషయాలను తమ గ్యాంగ్‌కు చేరవేశారు. మార్గ మధ్యలో ఓబేద్ వద్ద ఈ ముగ్గురు వ్యక్తులు రూ. 29 లక్షల బ్యాగ్‌ను దోపిడీ చేసి పరారయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారంటూ ఇలియాస్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అసలు సూత్రదారి ఖదీర్ అని తేలడంతో లోతైన దర్యాప్తు జరపడంతో తమ దోపిడీ స్కెచ్‌ను వివరించారు. దీంతో ఖదీర్, హబీద్ హరూన్, వర్దన్, రషికాంత్ బర్దన్లను అరెస్ట్ చేశారు, రషీద్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 28.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.