సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వాసుల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కారు దూరం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రస్తుత సర్కారు హయాంలో గాలిలో దీపంలా మార్చింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పేదలు ఆత్మగౌరవంగా జీవించాలన్న లక్ష్యంతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేపడితే ..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ పథకాన్ని అటకెక్కించింది. కనీసం నిర్మాణంలో ఉన్న ఇండ్లు పూర్తికాక, ఇటు పూర్తయిన గృహాల్లో కనీస సౌకర్యాలు లేక సామాన్యుడు సతమతమవుతున్నాడు. తాజాగా అధికారులు ‘ఆన్-ఆక్యుపైడ్’ అంటూ జారీ చేస్తున్న నోటీసులు పేదల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 63వేలకు పైగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటిన ఆ ఇండ్ల సముదాయాల్లో మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు మండిపడ్డారు. కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో లిఫ్టులు పనిచేయడం లేదని, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ ఇండ్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు, జోనల్ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టగా..స్పందించిన కమిషనర్లు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కానీ వాటర్ సప్లయి, డ్రైనేజీ , లిఫ్టులు, కరెంట్, రహదారులు, ఇతర సదుపాయాల పనులకుగానూ టెండర్లు పిలుస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. ఆచరణలో మాత్రం పనులు జరుగుతున్న దాఖలాలు లేవని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి లబ్ధిదారులు పెద్ద ఎత్తున వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ నిర్మాణ ప్రాజెక్టు అయిన కొల్లూరులో సుమారు 15,660 ఇండ్లలో మౌలిక వసతులపై లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.
రూ.100కోట్ల నిధులపై రానీ స్పష్టత?
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న బలమైన సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఉన్న చోటనే 27 ప్రాంతాల్లో (ఇన్ సైట్)లో 5,363 మందికి, 39 లొకేషన్లలో 63,478 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేసిన సంగతి తెలిసిందే. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో 66 లొకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు. కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. అయితే కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్, కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఇతర మెయింటనెన్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి.
ఈ మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా కేసీఆర్ సర్కారు హెచ్ఎండీఏ నుంచి రూ. 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. నిబంధనల ప్రకారమే జీహెచ్ఎంసీ ఖజానాలోకి రూ.100కోట్లు వచ్చి చేరాయి. కానీ నేటికీ ఈ నిధులు ఖజానా నుంచి నిర్వహణకు మళ్లలేదు.. పైగా డ్రైనేజీ, నల్లా కనెక్షన్ వేసిన జలమండలికి నిధులు మంజూరు చేయలేదు..డబుల్ బెడ్రూం ఇండ్లకు తాజా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. రూ. 100కోట్ల నిధులను ఎలా సమకూర్చుకుని మౌలిక వసతుల కల్పనకు ఎలా కృషి చేస్తారన్నది స్పష్టత లేదు. మొత్తంగా మరిన్ని నెలలు లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది.
గ్రేటర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిస్థితి ఇలా…
-మొత్తం మంజూరైన ఇండ్లు -1,00,000
-పూర్తయిన నిర్మాణాలు -68,176
-పంపిణీ చేసినవి -63,982
-కేటాయించగా ఖాళీగా ఉన్నవి-23,255
-అసంపూర్తిగా ఉన్నవి (నిర్మాణంలో)-31,824
-పంపిణీకి సిద్ధంగా ఉన్నవి – 4,194
(కానీ కేటాయింపులో సర్కారు వివక్ష వైఖరిని ప్రదర్శిస్తుండడం గమనార్హం.)