హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ శాఖల్లోని ‘హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్’ (హెచ్‌వోడీ) నుంచి సచివాలయంలోకి 12.5% కోటా అమలు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ కోటా అమలయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడంలేదు. వాస్తవానికి, కోటాను పునరుద్ధరిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. జీఏడీ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆశావహుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు సైతం స్వీకరించింది. ఆ తర్వాత ప్రక్రియను నిలిపివేసింది. పైగా ప్యానల్ ఇయర్ ముగింపునకు చేరుకొన్నది. కమిటీ వేస్తామన్నారు.. ఇంతవరకు అతీగతి లేదు. మళ్లీ ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు ముందడగు పడలేదు. దీంతో హెచ్‌వోడీల్లోని ఉద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు.
ప్రభుత్వ శాఖల డైరెక్టరేట్లు, కమిషనరేట్లను హెచ్వోడీలుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో 200కుపైగా హెచ్వోడీలున్నాయి. వీటిల్లో సూపరింటెండెంట్లకు సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్లను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా తీసుకొనే సంప్రదాయం ఉన్నది. అయితే, ఈ కోటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలు కావడంలేదు. సర్వీసులో ఒక్కసారైనా సచివాలయంలో పనిచేయాలన్న ఆశ హెచ్‌వోడీల్లోని ఉద్యోగుల్లో ఉంటుంది. కానీ, అవకాశం రాక హెచ్వోడీల్లోనే రిటైర్ అవుతున్నారు. అయితే, ఎస్వో క్యాడర్‌పై కమిటీ వేయాల్సి ఉన్నది. దీనిని పక్కనపెడితే ఏఎస్‌వోలను తీసుకొనేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవు. అయినా సర్కార్ చొరవ చూపడంలేదు.
సచివాలయంలోకి 12.5% కోటాను పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పలుమార్లు డిమాండ్ చేసింది. ఎట్టకేలకు ఈ కోటాను పునరుద్ధరిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా 2025 అక్టోబర్ 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆశావహుల నుంచి అక్టోబర్ 29 వరకు దరఖాస్తులను సైతం స్వీకరించింది. 150 మంది వరకు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ కోటాను పునరుద్ధరించడాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఈ కోటా అమల్లో అనేక ఉల్లంఘనలు జరిగాయని, 12.5% మించి 40%-50% వరకు వచ్చారని, క్యాడర్‌వారీగా సీనియారిటీ లేదని.. పలు శాఖల్లో సీనియారిటీ సమస్యలున్నాయని, ఉల్లంఘనలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది వివాదానికి దారితీస్తుందని భావించిన సర్కార్ తాను జారీచేసిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. మళ్లీ ఉత్తర్వులిస్తామన్నది. 10నెలలు గడుస్తున్నా.. ఆ దిశగా ముందుకు పడలేదు.
సచివాలయంలోకి 12.5% కోటాను వెంటనే అమలుచేయాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా అమలు చేయకపోతే ఎలా? జీవో జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ప్రక్రియను నిలిపివేయడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. వేలాది మంది అవకాశమెప్పుడు దక్కుతుందోనని, ఉత్తర్వులు ఎప్పుడొస్తాయోనని వేచిచూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని, కోటాను పునరుద్ధరించాలి.
– కట్కూరి శ్రీకాంత్, టీఎన్జీవో అధ్యక్షుడు, హైదరాబాద్ నగర శాఖ