దుండిగల్, మార్చి 15: దుండిగల్ సర్కిల్ పరిధిలో భవన నిర్మాణాల అనుమతుల అక్రమాలు తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఓ ప్రైవేట్ పాఠశాల భవన నిర్మాణ అనుమతులు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. మూడేండ్ల కిందట కట్టిన భవనాలకు ఇటీవల హెచ్ఎండీఏ అనుమతులు మంజూరు చేయడం సంచలనంగా మారింది. పైగా హెచ్ఎండీఏనే గతంలో సదరు భూములు ‘కన్జర్వేషన్ జోన్’ ఉన్నట్లు ప్రకటించిన చోటే బై నంబర్ల పేరిట అనుమతులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఇటీవల దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్‌లో కీలకపోస్టులో నియమితులైన ఓ అధికారి హెచ్ఎండీఏలో చక్రం తిప్పి దొడ్డి దారిన అనుమతులు ఇప్పించినట్లు వినపడుతుంది.
పలుకుపడిని ఉపయోగించి..
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో నేతనంటూ ఓ వ్యక్తి మూడేండ్ల కిందట బౌరంపేటలోని సర్వేనంబర్ 524, 525, 567లోని భూముల్లో ప్రైవేట్ పాఠశాలను ఏర్పాటు చేశాడు. సదరు భూములు కన్జర్వేషన్ జోన్లో ఉండటంతో మొదట్లో భవన నిర్మాణ అనుమతులు రాలేదు. తన పలుకుబడిని ఉపయోగించిన స్కూల్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండానే జీ+1 అంతస్తుల్లో గదులను నిర్మించి,తరగతులను నిర్వహిస్తున్నది. నాటి నుంచి అధికారులను మేనేజ్‌చేసుకుంటూ వస్తున్న పాఠశాల యాజమాన్యం ఇటీవలే అదే హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందడం చర్చనీయాంశంగా మారింది.
ఓ అధికారి..
దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్‌లో కీలకపోస్టులో పనిచేస్తున్న ఓ అధికారి హెచ్ఎండీఏ అధికారులను మేనేజ్ చేసి..సర్వేనంబర్ 524, 525, 567లలోని భూములను పార్టులుగా అంటే 524 పార్టు, 525 పార్టు, 567 పార్టుగా చూపి భవన నిర్మాణ అనుమతులు ఇప్పించినట్లు స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సదరు స్కూల్ నడుస్తున్న భవనాలు 2031 వరకు కన్జర్వేషన్ జోన్లోనే ఉన్నట్లు స్వయంగా హెచ్ఎండీఏనే నిర్ధారించింది. ఈ విషయాన్ని ల్యాండ్ యూజ్ ఇన్ఫర్మేషన్లో హెచ్ఎండీఏనే వెల్లడించింది. అవే భూముల్లో నిర్మించిన భవనాలకు హెచ్ఎండీఏ ఇప్పుడు ఏవిధంగా అనుమతులు ఇచ్చిందనేదే ప్రశ్నగా మారింది.
నాలా కన్వర్షన్‌ను అడ్డుపెట్టుకుని..
హెచ్ఎండీఏ కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించిన ఈ భూములకు 2021-22లో అప్పటి తహసీల్దార్ నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ జారీ చేయడంతో సదరు స్కూల్ యాజమాన్యం తన అక్రమాలకు మరింత పదును పెట్టింది. వాస్తవానికి కన్జర్వేషన్ జోన్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ భూములుగా మార్చాలన్నా రాష్ట్ర మంత్రివర్గం స్పెషల్ జీవోను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే జోన్ మార్పిడి జరగకుండా, వక్రమార్గంలో తహసీల్దార్ ఇచ్చిన నాలా కన్వర్షన్‌ను అడ్డు పెట్టుకుని నిర్మాణం చేసినట్టుగా తెలుస్తున్నది.
వ్యవహారంలో పెద్దమొత్తంలో ముడుపులు చేతులుమారాయనే తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా కన్వర్షన్ ఆధారంగా అగ్నిమాపక శాఖ, విద్యాశాఖ,రో డ్లు భవనాల శాఖ వంటివి ఎన్వోసీలు జారీ చేయడం విస్మయం కలిగిస్తున్నదని స్థానికులు అంటున్నారు. విశేషమేమిటంటే పాఠశాల పరిసర ప్రాంతాల నుంచి కనెక్టివిటీ రోడ్డు వరకు కనీసం 40 ఫీట్ల రోడ్డు ఉంటేనే ఆర్ అండ్ బీ ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా పాఠశాల పరిసర ప్రాంతంలో ఎక్కడా అటువంటి రహదారులు కనిపించవని పలువురు పేర్కొంటున్నారు.
నిబంధనల ఉల్లంఘన…?
భౌరంపేటలోని ప్రైవేట్ పాఠశాల భవన నిర్మాణాల అనుమతుల జారీలో అడుగడుగునా ఉల్లంఘనలే చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఒక స్థలంలో భవన నిర్మాణాలకు నిర్మాణదారుడు హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అన్ని నిబంధనల ప్రకారం సక్రమంగా ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేస్తారు. కానీ మూడేండ్ల కిందట కట్టిన నిర్మాణాలకు హెచ్ఎండీఏ 2025, సెప్టెంబర్ 18న అనుమతులు జారీ చేయడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఒక వేళ అనుమమతులు జారీ చేసే సమయానికి అక్కడ నిర్మాణాలు లేవనుకుంటే ఉపగ్రహఛాయ చిత్రాలను పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నారు.
సదరు పాఠశాలకు విద్యాశాఖ 2022 జూలై 7న ప్రీ ప్రైమరీ నుంచి 7 తరగతి వరకు పాఠశాల నడుపుకొనేందుకు అనుమతులు ఇచ్చింది. దీన్ని బట్టి మూడేండ్ల నుంచే అక్కడ పాఠశాల నడుస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఒక వేళ అక్కడ పాఠశాల నిర్వహించక పోతే అనుమతులు ఎందుకు ఇచ్చినట్లు…? ఏ ప్రాతిపదికన జారీ చేసినట్లు ..? పాత భవనాలకే హెచ్ఎండీఏ అనుమతులు కొత్తగా జారీ చేసిందా..? ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే ఏఏ శాఖలో ఎంతెంత అవినీతి జరిగింది? ఎవరెవరి పాత్ర ఉందనేది తెలుస్తుందంటున్నారు.