సిద్దిపేట, మార్చి 15 : పెన్షన్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా రేవంత్‌రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికే 60 మంది చనిపోయారని, వారి చావులకే సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యుడని అన్నారు. ఇంకెంతమంది చనిపోతే ముఖ్యమంత్రి స్పందిస్తారని ప్రశ్నించారు. బెనిఫిట్స్, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సిద్దిపేటలోని అంబేదర్ చౌరస్తాలో చేపట్టిన నిరహార దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 35 ఏండ్లు కష్టపడి పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులను రేవంత్‌రెడ్డి సర్కార్ రోడ్డుమీదకు తెచ్చిందని మండిపడ్డారు. పెండింగ్ డీఏలు ఇస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి మనసు రావడం లేదని ధ్వజమెత్తారు.
రూ.10 వేల కోట్ల బకాయిలు ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే.. ‘నన్ను కోసుకొని తిన్నా డబ్బులు లేవు’ అన్న రేవంత్‌రెడ్డికి రూ.96 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మూసీ అభివృద్ధి కోసం 10వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధం అయ్యాడని దుయ్యబట్టారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తూ, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులకు ఇవ్వడం చేతకావడం లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కమీషన్ ఇచ్చే వారికే డబ్బులు ఇస్తారని, కమీషన్ ఇవ్వరని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రిటైర్డ్ ఉద్యోగులకు నెలలోపే బెనిఫిట్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 92వేల మంది ఉద్యోగులు కేసీఆర్ హయాంలో రిటైర్డ్ అయితే వెంటనే డబ్బులు చెల్లించినట్టు చెప్పారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.లక్షా యాభై ఐదు వేల కోట్ల అప్పులు తెచ్చిందని అన్నారు. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారని, అందులో రూ.పదివేల కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొకిందని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు రూ. 18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లను ప్రీప్రైమరీ టీచర్లుగా గుర్తించి, ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించేలా చూడాలని కోరారు. అసలు ప్రభుత్వ సూళ్లలో పెడుతున్న ప్రీ-ప్రైమరీకి, అంగన్వాడీలకు తేడా ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హెల్పర్ స్థాయి నుంచి ప్రమోషన్ పొందిన వారికి టీచర్‌గా పూర్తి జీతం ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు.