తుంగతుర్తి, ఆగస్టు 08 : తుంగతుర్తి నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం గుంతలు పడి చెరువులా కనిపించే రోడ్డుపై వరి నాట్లు వేసి, గాళాలతో చేపల పడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం నుండి మానాపురం ఎక్స్ రోడ్డు వరకు రూ.28 కోట్లతో 2023 నవంబర్లో మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నూతన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేలు కూడా అదే రోడ్డు పనులకు జాజిరెడ్డిగూడెం నుండి మనపురం తండా మళ్లీ ఆయన పేరుతో శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు అవుతుందని ఇంతవరకు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తెలిపారు.
రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి స్థానిక ప్రజలకు, వాహనదారులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి మధు, కొండగడుపుల వెంకటేష్, కాసర్ల రాజశేఖర్, తడకమళ్ల మధు, బొంకూరి సాయి, కొండ మధు, కడియం గోపి, కొండగడుపుల నాగరాజు, గడ్డం నితిన్, పవన్, బద్రి పాల్గొన్నారు.

తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన