న్యూఢిల్లీ, మార్చి 15 : టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా పలువురు ఉద్యోగులపై చర్యలకు దిగింది. ఉద్యోగులకు కల్పించే లీజర్ ట్రావెల్ పాలసీని దుర్వినియోగం చేసినందుకు గాను పెనాల్టీలు విధించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఎయిరిండియాలో ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ (ఈఎల్టీ) పాలసీ కింద ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములకు ఉచిత విమాన ప్రయాణ సదుపాయం ఉంటుంది. ఏడాదికి కొన్ని ఉచిత టికెట్లు కేటాయిస్తారు. అయితే సంస్థ జరిపిన అంతర్గత దర్యాప్తులో కొందరు ఈ పాలసీని దుర్వినియోగం చేసినట్టు తేలింది.
మొత్తంగా 4 వేల మంది ఉద్యోగులు ఈ పాలసీని దుర్వినియోగం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తమ కుటుంబ సభ్యులు కానప్పటికీ తమ వారేనని చూపించి ట్రావెల్ పాలసీ ప్రయోజనాలను కొందరు ఉద్యోగులు పొందినట్టు తెలుస్తున్నది. కొందరైతే ఉచిత టికెట్లు పొంది.. వాటిని వేరే వ్యక్తులకు అధిక ధరకు విక్రయించిన ఉదంతాలూ దర్యాప్తులో తేలినట్టు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై ఎయిరిండియా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా జారీచేయలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ దుర్వినియోగం చోటుచేసుకుందని తెలిసింది.