Praggnanandhaa | అమెరికాలో గ్రాండ్ చెస్ టూర్ (GCT) సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ 2026 టోర్నమెంట్ ఐదు రోజుల పాటు జరిగింది. గురువారం జరిగిన ఈ టోర్నీఫైనల్లో 20 ఏండ్ల భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ ప్రజ్ఞానందకు గట్టి పోటీనిచ్చాడు. అయినప్పటికీ 1.5 పాయింట్ల తేడాతో వెనుకపడిపోయాడు. దీంతో ఇంకో రౌండ్ మిగిలి ఉన్నప్పటికీ ప్రజ్ఞానంద టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రజ్ఞానందకు యాభై వేల డాలర్ల నగదు బహుమతితో పాటు 13 GCT పాయింట్లు దక్కాయి. దీంతో అతడు 2026 సీజన్ స్టాండింగ్స్‌లో అమెరికాకు చెందిన ఫాబియానో కరువానా తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆగస్టు 10న నిర్వహించే ‘సింక్విఫీల్డ్ కప్’తో జీసీటీ సీజన్ ముగియనుంది. దీనిలో ప్రజ్ఞానందతో పాటు సెయింట్ లూయిస్ టోర్నీలో ఆడిన చెస్ క్రీడాకారులందరూ పోటీపడనున్నారు.
ప్రజ్ఞానంద ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన నార్వే చెస్ టోర్నీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించాడు. ఈ టోర్నీలో ఏడుసార్లు నార్వే చెస్ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం గమనార్హం. నార్వే చెస్ టోర్నీ గెలవడంతో తమిళనాడు సీఎం ప్రజ్ఞానందను సన్మానించి, రూ. 50 లక్షల నగదు బహముతి అందజేసిన సంగతి విదితమే. జీసీటీ విజయంతో ప్రజ్ఞానందను ప్రజలు ప్రశంసిస్తున్నారు.