సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : 11 జిల్లాలు.. వందలాది గ్రామాల పరిధిలో వేలాది ఎకరాలను కలిగి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ… విలువైన ఆస్తుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. 2017లో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం హెచ్ఎండీఏకు మొత్తం 8260 ఎకరాల కేటాయింపులు జరిగాయి. ఇందులో 3886 ఎకరాల పైగా భూములను ఇతర లే అవుట్లు, పార్కులు, ఇతర అవసరాలకు వినియోగంలోకి తీసుకువచ్చారు.
కానీ మిగిలి ఉన్న 4374 ఎకరాల భూములను గాలికొదిలేసింది. హెచ్ఎండీఏ ఆస్తులను పర్యవేక్షించే ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం.. విలువైన భూములపై కబ్జాకోరుల కంటిలో పడుతున్నాయి. ఇలా మియాపూర్ పరిధిలో ఉన్న దాదాపు 500 ఎకరాలలో నిరుపేదల పేరున పాగా వేసేందుకు ప్రయత్నించి… చెలరేగిన వివాదం తర్వాత కూడా హెచ్ఎండీఏ కండ్లు తెరవడం లేదు. ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న జియో ఫెన్సింగ్, హద్దుల నిర్ధారణ, కంచెల ఏర్పాటు అంశాన్ని మరిచింది. దీంతో విలువైన భూములన్నీ కూడా కబ్జాదారుల చెరలో పడుతున్నాయి.
దాదాపు 11వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన హెచ్ఎండీఏకు ఖాళీ జాగాలే ప్రధాన ఆస్తులు. కోర్ సిటీలో నిర్మాణాలు ఉన్నా.. వీటితో వచ్చే ఆదాయం నెలవారీ ఖర్చులకు కూడా సరిపోవు. ఇక హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు మంజూరైతే గానీ ఖజానాకు ఆదాయం చేరని పరిస్థితి ఉంటుంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా హెచ్ఎండీఏ ఆర్థికంగా చితికిపోయింది. భారీ మొత్తంలో వచ్చే నిర్మాణ రెవెన్యూ తగ్గిపోవడంతో అదనపు ఆదాయం లేక అప్పులు చేస్తే గానీ కొత్త ప్రాజెక్టులను చేపట్టే వీల్లేకుండా పోయింది. ఇలా నిత్యం రియల్ ఎస్టేట్ లావాదేవీలపై ఆధారపడి రాష్ట్ర ఖజనాకు ఆదాయం సమకూర్చే హెచ్ఎండీఏలో ఉన్న విలువైన భూముల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఎస్టేట్‌లో సమన్వయ లోపం…
హెచ్ఎండీఏకు చెందిన స్థిరాస్తులను పర్యవేక్షించే ఎస్టేట్ విభాగంలో నెలకొని ఉన్న సమన్వయ లోపం ఇప్పుడు ఆ భూముల పాలిట శాపంగా మారింది. ఏడాదిన్నరకొసారి ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిపోయే అధికారులతో అసలు ఎస్టేట్ విభాగంలో పర్యవేక్షణ కరువైతుంది. ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు కాగితాలపై కనిపించే భూములు… క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులలో ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 3899 ఎకరాలు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 37 ఎకరాలు, మెదక్ జిల్లా పరిధిలో 437 ఎకరాల చొప్పున మొత్తంగా 4374 వేల ఎకరాల భూమి ఉన్నట్లు నివేదిక చెబుతుండగా… ఇందులో మెజార్టీ జాగాలపై కోర్టు వివాదాలే ఉంటే, మిగిలిన ఖాళీ జాగాలను ఆక్రమణలతో హెచ్ఎండీఏకు లేకుండా చేస్తున్నారు. ఇలా వేల కోట్లు విలువ చేసే భూముల విషయంలో కమిషనర్ ఉన్నత స్థాయిలో సమీక్షించి, భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న భూములు, జీయో ఫెన్సింగ్, హద్దుల నిర్ధారణ, ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టకపోవడంతో… భూములకు రక్షణ లేకుండా పోతుంది.