మణికొండ, మే 29 : నగర శివారు ప్రాంతంలోని గండిపేట మండలంలో తప్పుడు డాక్యుమెంట్లతో దాదాపు రూ రెండు వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ఓ ఘరానా మోసగాడు యత్నించాడు. గండిపేట మండలం నేక్నాపూర్ గ్రామ సర్వేనెంబర్ 44 లో చెరువు, 20 లో ఎఫ్టీఎల్ ఉన్నట్లు కొద్ది రోజుల కిందట అధికారులు గుర్తించారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి 50 ఏళ్ల కిందట తాము 30 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తప్పుడు ఫోర్జరీ పత్రాలను సృష్టించాడు.
ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు అప్పటి రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ భారతి హోళీ కేరి సంతకాలను ఫోర్జరీ చేసి ఉత్తర్వులు రూపొందించారు. గండిపేట మండలం తహసీల్దార్‌గా వేణుగోపాల్ అనే వ్యక్తి పేర్లను సృష్టించి ప్రొసీడింగ్స్ ని సిద్ధం చేశారు. వీటి ఆధారంగా ధరణి పోర్టల్ లో తమ పేర్లను చేర్చాలంటూ మూడు నెలల కిందట రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ వాటిని తిరస్కరించారు.
ఇబ్రహీం అనే వ్యక్తి తప్పుడు ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని కుట్రతో న్యాయస్థానాన్ని సైతం తప్పుడు తవ పట్టించి ప్రయత్నిస్తున్నాడని తక్షణమే విచారణ చేపట్టి అతనిపై కేసు నమోదు చేయాలని మూడు నెలల కిందట నార్సింగి పోలీసులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇబ్రహీం చెరువును చెరపట్టేందుకే అక్రమ దారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారని పోలీసులు గుర్తించారు.
30 ఎకరాలు వశం చేసుకునేందుకు..
ఇబ్రహీం దాదాపు రెండు వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి.. ఇబ్రహీం అప్పటి పూర్వ కలెక్టర్ భారతి హోలీ కేరి సంతకాలతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి 30 ఎకరాలను తమ వశం చేసుకునేందుకు కుట్రలు చేసినట్లు తేల్చారు. అప్పటి పూర్వ కలెక్టర్ హోళీ కేరి ఇచ్చిన ప్రొసిడింగ్స్‌ను అధికారులు పూర్తిస్థాయిలో విచారించగా ఎక్కడ ప్రొసిడింగ్స్ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు.
ఇబ్రహీం చెరువు భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు తహసీల్దార్‌గా వేణుగోపాల్ ఇచ్చినట్లు తప్పుడు ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లుగా పోలీసులు తేల్చారు. 2024 లో తహసీల్దార్ వేణుగోపాల్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తప్పుడు ఫోర్జరీ పత్రాలను చూపించారు. ఇవన్నీ పోలీసుల విచారణలో తేలడంతో నిందితుడు ఇబ్రహీం పై చట్టపరమైన కేసులో నమోదు చేసి జైలుకు పంపుతామని నార్సింగి పోలీసులు తెలిపారు.