మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Oct 09, 2020 , 06:20:41

కొత్తగా.. రెక్కలొచ్చెనా..

కొత్తగా.. రెక్కలొచ్చెనా..

  • కొంగొత్త ఆశయాలతో కొలువులకు 
  •  కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు
  • అంబరాన్నంటిన సంబురాలతో ‘పాసింగ్‌ అవుట్‌'
  • పట్టరాని సంతోషంతో విధులకు సన్నద్ధం
  • యూనిఫాంపై మక్కువతో వచ్చిన ఉన్నత విద్యావంతులు
  • త్వరలోనే ఠాణాల్లో చేరనున్న ‘రక్షకులు’

వరంగల్‌ క్రైం : సమాజ ‘రక్షకులు’ కావాలనుకున్న వారి తపన నెరవేరింది. ఖాకీ యూనిఫాం ధరించాలనే దృఢ సంకల్పం వారిని పోలీస్‌ ఉద్యోగాల బాట పట్టించింది. ఉన్నత చదువులు చదివినా రాత్రింబవళ్లు శ్రమించి పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి తాము కన్న కలలను నిజం చేసుకున్నారు. మా మునూరు పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 9 నెలల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకుని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో కొలువుదీరేందుకు 725 మహిళా కానిస్టేబుళ్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని పాత ఎనిమిది జిల్లాల నుంచి 725 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు మామునూరు పీటీసీలో గురువారం ‘దీక్షాంత్‌ పరేడ్‌' ముగించుకుని సొంత జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో అడుగుపెట్టబోతున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పీ ప్రమోద్‌కుమార్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరై ట్రైనీల గౌరవ వందనం స్వీకరించి దిశానిర్దేశం చేశారు. కమాండర్‌గా వరంగల్‌కు చెంది న జే శిరీష వ్యవహరించారు. అనంతరం సీపీ ప్ర మోద్‌కుమార్‌ మాట్లాడుతూ నీతి నిజాయితీతో వి ధులు నిర్వర్తిస్తూ, ప్రజలకు రాజ్యాగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తెలంగాణ పోలీస్‌ విభాగంలో ఒకే రోజు 725 మంది మహిళా పోలీసులు భాగస్వామ్యం కానుండడం ప్రతి మహిళా గర్వపడాల్సిన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో పెద్ద మెత్తంలో మహిళలకు పోలీస్‌ శాఖలో అవకాశం దక్కిందన్నారు. అనంతరం డీఎస్పీ ఎం శ్రీనివాస్‌, ఏఆర్‌ఎస్సై యాదగిరి, హెడ్‌కానిస్టేబుల్‌ అమీరుద్దీన్‌, కానిస్టేబుల్‌ బాలును సేవా పతకాలతో అభినందించారు. ట్రైనింగ్‌ సమయంలో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన ట్రైనీలకు మెమెంటోలు అందించారు. బెస్ట్‌ ఇండోర్‌గా నల్లగొండ జిల్లాకు చెందిన ఈ జ్యోతి, బెస్ట్‌ అవుట్‌ డోర్‌గా నిజామాబాద్‌కు చెందిన ఫర్హీన్‌, బెస్ట్‌ ఫైరర్‌గా నల్లగొండకు చెందిన జీ సుష్మాస్వరాజ్‌, బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌గా నల్ల గొండకు చెందిన ఈ జ్యోతికి జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో సెంటర్‌ ప్రిన్సిపాల్‌ గంగా రాం, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు. 

తొమ్మిది నెలలు కఠోర శిక్షణ

జనవరి 17న మామునూరు పీటీసీలో శిక్షణ ప్రారంభమైంది. 9 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకు ని, అవుట్‌ డోర్‌, ఇన్‌డోర్‌లో పురుషులకు ఏ మా త్రం తీసిపోకుండా అత్యుత్తమ ప్రతిభ చూపి అధికారులతో ‘ఔరా’ అనిపించుకున్నారు. అవుట్‌ డోర్‌లో ని ఫైరింగ్‌, లాటీ డ్రిల్‌, వెపన్‌ డ్రిల్‌, వెపన్‌ హ్యాం డ్లింగ్‌, ఫైర్‌ సేఫ్టీ, ఫిజికల్‌ ట్రైనింగ్‌ లాంటి అంశాల్లో రాణించారు. ఇన్‌డోర్‌లో సైతం సైబర్‌ క్రైమ్‌, పర్స నాలిటీ డెవలప్‌మెంట్‌, లాలోని ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండివిజువల్‌ యాక్ట్‌ సిలబస్‌పై పట్టుసాధించారు. 

జిల్లాల వారీగా..

ఆదిలాబాద్‌ 96

కరీంనగర్‌ 94

ఖమ్మం 33

మహబూబ్‌నగర్‌ 116

మెదక్‌ 96

నల్లగొండ 116

నిజామాబాద్‌ 67

వరంగల్‌ 107

వీరిలో వివాహితులు 204

అవివాహితులు 521 

సీపీటీసీలో దీక్షాంత్‌ పరేడ్‌  హాజరైన నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి

మడికొండ : మడికొండ శివారులోని సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (సీపీటీసీ)లో తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 262 మంది కానిస్టేబుళ్లకు గురువారం దీక్షాంత్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ సమాజంలో సత్ప్రవర్తనతో విధులు నిర్వర్తించాలన్నారు. పేదలకు అండగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఎదురయ్యే ప్రతి సందర్భం కొత్తగానే ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెంటర్‌ ప్రిన్సిపాల్‌ పీవీ మురళీధర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పీ సాంబయ్య, ఏఆర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సీఎల్‌ఐలు సీతారెడ్డి, రమణమూర్తి, కృష్ణ, ఆర్‌ఎస్సై ఖయ్యూం, ఏఆర్‌ ఎస్సై సంపత్‌, సిబ్బంది పాల్గొన్నారు. logo