Grama Panchayats | గ్రామాలు బాగుండాలంటే ప్రజల సమస్యలను వినేందుకు, వాటిని తీర్చేందుకు గ్రామపంచాయతీ పాలక వర్గం ఉండాలి. ఇంతకీ పాలకవర్గమే లేకుంటే మరి తమ గోడు వెళ్లబోసుకునేది ఎవరికి..? ఇదీ ప్రస్తుతం తెలంగాణలోని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా.. ? తమ ఊళ్లకు కొత్త పాలకవర్గం ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కుటుంబానికి పెద్ద దిక్కు లేని మాదిరిగా సర్పంచులు లేక గ్రామపంచాయతీలు బిక్కు బిక్కుమంటున్నాయి. గ్రామాలలో గొడవలు జరిగితే న్యాయం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇక గ్రామాలలో అభివృద్ధి పనులు జరగక, చెత్త ఎత్తే నాధుడే లేక గ్రామాలు కన్నీరు పెడుతున్నాయి. ఈ పాపం ఎవరిది… ఎవరి స్వార్థాల కోసం గ్రామాలను దివాళా తీస్తున్నారు.
గత పాలనలో గ్రామానికి సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటూ గ్రామాలను కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ నేడు గ్రామాలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. గ్రామాలలో నీటి సమస్య, పారిశుధ్య సమస్య రాజ్యమేలుతున్నా ఎవరిని అడగాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక గ్రామస్తులు బాధను దిగమింగుకుంటున్నారు.
కల తప్పిన పండుగలు, ఉత్సవాలు..
గ్రామాల్లో సర్పంచులు లేక కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడింది. గ్రామాలలో పండుగలు, ఉత్సవాలు జరపాల్సి వచ్చినప్పుడు గ్రామ సర్పంచ్ గ్రామానికి పెద్దగా ముందు నిలబడి అన్ని తానేనంటూ ప్రజలకు సూచనలు చేస్తూ కార్యక్రమాలను దిగ్విజయం చేసేవాడు. కానీ ప్రస్తుతం సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు లేక గ్రామాలలోని పండుగలు, ఉత్సవాలు కల తప్పాయి.
నోటిఫికేషన్ పడింది కదా ఇక గ్రామాలకు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు వస్తారులే అని మురిసిన గ్రామస్తులకు రిజర్వేషన్ అనే పిడుగు పడింది. కోర్టు తీర్పుతో ఎన్నికలు వాయిదా పడగా, దిక్కుతోచని స్థితిలోకి గ్రామాలు వెళ్లాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్య నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఎన్నికలు జరుపుతారా..? లేక గ్రామాలకు సర్పంచులు లేక చరిత్రలో నిలిచిపోతారా..? అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Chandur : బీఆర్ఎస్ కస్తాల గ్రామ నాయకుల ఆర్థిక సాయం
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర