హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తుందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ఆరోపించారు. ధనబలంతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలుస్తోందని విమర్శించారు. జనబలం లేక ఎమ్మెల్యేలను కొనడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని తెలిపారు. గతంలో ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేసిన కుట్రలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ, జార్ఖండ్‌లో బీజేపీకి బుద్ధి చెప్పారని.. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందని అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీచ రాజకీయాలతో భారతీయ జనతా పార్టీ దేశ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని వై.సతీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూత్వానికి తాము బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే బీజేపీ.. ఇలాంటి పని చేయించడం యావత్ హిందూ సమాజాన్ని అవమానించడమే అవుతుందని అన్నారు. హిందూ సమాజానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేయలేక ఏం చేశామో చెప్పుకోలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. డబ్బులతో నీచ రాజకీయం చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇకనైనా నీచ, ధన రాజకీయాలు మానేసి ప్రజలకు మంచి చేయడంపై ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.
మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తాలేని బీజేపీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి దొరికిపోయింది. మొయినాబాద్‌కు సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురు పట్టుబడ్డారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందని నందకుమార్ ఉన్నారు. వీరి దగ్గర నుంచి రూ.15 కోట్ల నగదును సీజ్ చేశారు.