దమ్ముంటే, చేతనైతే రాష్ట్రానికి నాలుగు మంచి పనులు చేసి, తెలంగాణ సమాజం మెప్పు పొందే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను, బీజేపీ నాయకులను ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. అంతేకానీ.. వందల కోట్ల రూపాయలిచ్చి, కాంట్రాక్టులిచ్చి, పదవులు ఎరవేస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంగట్లో అమ్ముడుపోయే సరుకులు కాదని మండిపడ్డారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులిచ్చి రాజగోపాల్రెడ్డి లాంటి దగుల్బాజీ నాయకులను కొనుక్కోవచ్చని, దమ్మున్న తెలంగాణ ఉద్యమకారులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయలేరని అన్నారు.
ఎన్నటికీ తెలంగాణ బిడ్డలు, గుజరాతీ గులాములు కాదని, తెలంగాణకే తలమానికంగా గొప్పగా ప్రవర్తిస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనియాడారు. సమాజం గర్వపడే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తారని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో పోలీసులకు బీజేపీ నేతలు దొరికిపోవడంతో
బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై, కేంద్రప్రభుత్వ పెద్దలపై తీవ్రంగా మండిపడ్డారు.
” కేంద్రంలోని పెద్ద మనుషులకు సంబంధించిన సింహయాజులు, రామచంద్రభారతి, నందకుమార్ అనే ముగ్గురు బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.100కోట్లకు పైగా నగదు, కోట్లాది రూపాయల విలువ చేసే కాంట్రాక్టులు, పదవులు ఎరగా చూపి.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.. పోలీసులకు అందజేశారు. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా వీరిని పట్టుకోవడం జరిగింది.
ఇవాళ తెలంగాణలో ప్రజల మనసు గెలుచుకోలేని దమ్ములేని దద్దమ్మలున్న భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలువబోతుందని తెలిసి , బీజేపీకి డిపాజిట్ పోతుందనే భయంతో అనేక రకాల కుట్రలకు తెరలేపుతూ నిస్సిగ్గుగా, అడ్డదారిన, దొడ్డిదారిన, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఇటువంటి దుర్మార్గపు ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వము.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే బీజేపీ నేతృత్వంలో జరుగుతున్న ఇలాంటి పనులను తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. బిడ్డా.. ఆరు దశాబ్దాలకుపైగా పోరాటం చేసినటువంటిది తెలంగాణ సమాజం.. ఎందరో నాయకులను, ఎన్నో పార్టీలను , ఎన్నో కుట్రలను తట్టుకుని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నం.
తెలంగాణ సమాజం.. అమ్ముడుపోయేది కాదు, ఆగమయ్యేది కాదు. బిడ్డా మీ అంతం చూస్తమని బీజేపీని తెలంగాణ సమాజం తరఫున హెచ్చరిస్తున్నా. గతంలో భారత దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టింది. కర్టాటక, గోవా, మహారాష్ట్రలో ప్రభుత్వాలను పడగొట్టింది. మహారాష్ట్రలో శివసేన లాంటి పార్టీని నిట్టనిలువునా చీల్చి దుర్మార్గంగా అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలు ఎరవేసి , ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిన బీజేపీ.. ఇవాళ తెలంగాణకు ఒక్క మంచి పని చేయకపోగా తెలంగాణలో విధ్వంసం సృష్టించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే చిల్లర ప్రయత్నం చేయడం దుర్మార్గమైన విషయం. యావత్ తెలంగాణ సమాజం బీజేపీపై తిరగబడ్తది. బిడ్డా మీ ఆగడాలకు చరమ గీతం పాడే సందర్భం వచ్చింది’ అని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ బీజేపీ నాయకులు తెలంగాణతోని పెట్టుకుంటున్నరంటే.. కొరివితో తలగోక్కుంటున్నట్లే లెక్క. కేసీఆర్తో పెట్టుకున్నరంటే కొరివితో తలను గోక్కున్నట్లే లెక్క. తెలంగాణ సమాజాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని , అభివృద్ధిని విచ్చిన్నం చేస్తున్నటువంటి ఇలాంటి కుట్రలను ఇవాళ మీడియా సాక్షిగా పోలీసులు బట్టబయలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హ్యాట్సాప్ చెబుతా ఉన్నాను. బీజేపీ కుట్రను, కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల కుట్రలను ఏవిధంగా బయటపెట్టినారో చూసిన తెలంగాణ సమాజం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి ఇవాళ తెలంగాణ సమాజం ఆనందపడుతోంది. ఉద్యమకారులైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు ముందుంటారు. ఎన్నటికీ తెలంగాణ బిడ్డలు, గుజరాతీ గులాములు కాదు. తెలంగాణకే తలమానికంగా గొప్పగా ప్రవర్తిస్తరు.
సమాజం గర్వపడే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పనిచేస్తరు. ఇదే విషయాన్ని మరోసారి ఎమ్మెల్యేలు నిరూపించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేశారు. తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లారా.. బీజేపీ నాయకులారా దమ్ముంటే, చేతనైతే తెలంగాణకు నాలుగు మంచి పనులు తెలంగాణ సమాజం మెప్పు పొందే ప్రయత్నం చేయండి. అంతేకానీ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, పదవులు ఎరవేస్తే.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలా అమ్ముడుపోయే అంగట్లో సరుకులు కాదు. 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి రాజగోపాల్ రెడ్డి లాంటి దగుల్బాజీ నాయకులను కొనుక్కోవచ్చు కానీ.. దమ్మున్నటువంటి, ఉద్యమ కారులను కొనలేరు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేయలేరు. ఇవాళ మీ బాగోతం బట్టబయలైంది. బండారం బట్టబయలైంది. తెలంగాణ యావత్ సమాజం.. బీజేపీ మీద రగిలిపోతోంది. ఆగ్రహావేశాలతో ఊగిపోతుంది.
గతంలో ఇదే విధంగా ఒక నాయకుడు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ మళ్లోసారి బీజేపీ, కేంద్రప్రభుత్వం అదేవిధంగా ప్రలోభ పెట్టి మా ఎమ్మెల్యేలను , టీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలని చూసింది. కానీ అప్రమత్తతో వాళ్లు ఆగమైనరు. కేంద్ర ప్రభుత్వ పెద్లల దుర్నీతిని, దుర్భుద్ధిని, ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపినారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బుద్ధి, సిగ్గు తెచ్చుకుని, క్షమాపణలు చెప్పి ప్రజల మనసుల్లో ఎలా స్థానం సంపాదించాలో ఆలోచన చేయండి. అంతేకానీ ఇలాంటి చిల్లర మల్లర వేషాలు వేస్తే.. తెలంగాణ సమాజం అంతా కలిసి బీజేపీని రాష్ట్రం నుంచి కూకటి వేళ్లతో పెకిలించి వేస్తది. 14 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఈ సైనికులు రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటరు. మేం.. తెలంగాణ అభివృద్ధికి ఇంకా పునరంకితం అవుతం తప్ప.. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలోభాలకు లొంగిపోం. ఇప్పటికైనా ఇలాంటి పనులను బీజేపీ బంద్ చేయాలి.
ఎన్నికల్లో గెలిచే దమ్ములేక బీజేపీ ఇలా చిల్లర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నుంచి చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చి, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పొగుడుతూ ఉంటే.. బీజేపీ నాయకులకు కండ్లు మండిపోతున్నాయి. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, చిల్లర పనులు చేస్తుంది. మునుగోడు ప్రజలు బీజేపీ నాయకుల వేషాలు చూసి.. ఉప ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలి.. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి. ఇదే మునుగోడు ప్రజలకు నా విజ్ఞప్తి అని బాల్కసుమన్ పిలుపునిచ్చారు.