Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర.. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందన్నారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హరీష్ రావు అన్నారు.
ఎన్టీఆర్ జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్ కాంగ్రెస్ ద్రోహి రేవంత్. కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి అయి వుండీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్. అవినీతి దాహం, ప్రజా ద్రోహం వెరసి రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నటీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి..? కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం.. రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ.. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నలలోనే సాగుతున్నది. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్నబాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అని హరీష్ రావు మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే.. అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా..? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు బాధ్యత ఎటు పోయింది? సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడే హోమ్ శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా..? అని హరీష్ రావు అడిగారు.
రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు హరీష్ రావు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తాం, ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతామన్నారు. తెలంగాణ డీజీపీ ఈ హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై మీరు తీసుకునే చర్యలేమిటి..? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా..? లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.