KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించింది.. బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
పదేండ్ల నాడు జూన్ 2014లో ఒక అనిశ్చిత పరిస్థితి ఉండేది. నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తూ విద్యుత్ విషయంలో దివాళా తీస్తారని, తెలంగాణలో చీకట్లు ఉంటాయన్నారు. ఇంకొకరు పెట్టుబడులు రావు, ఉన్న పెట్టుబడులు పోతాయన్నారు. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రా – తెలంగాణ, హిందూ – ముస్లిం గొడవలు, తిరిగి నక్సలైట్లు వస్తారని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా, సామర్థ్యం ఉందా..? అని రకరకాలుగా ప్రశ్నించారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
కానీ ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు. సభకు ఇచ్చిన సోషియో ఎకానమిక్ అవుట్ లుక్‌లో తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. 2022 మార్చి 15న ఇదే సభలో ప్రతిపక్ష హోదాలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి సంవత్సరం సంపద సృష్టిస్తున్నారు. రాష్ట్రాన్ని కరోనా అతాలకుతలం చేసినప్పటికీ ఆ దాడిని తట్టుకోని ఉత్పత్తిని, సంపదను పెంచడం జరిగిందన్నారు. అక్కడ కూర్చోగానే స్వరం మారింది. అయినప్పటికీ వారు ఇచ్చిన అవుట్ లుక్‌లోనే అన్ని విషయాలు వివరంగా చెప్పారు. ఇందులో వాస్తవాలు బయటపడ్డాయని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఉజ్వల తెలంగాణగా ఎదుగుతుంది. ఇందులో రెండో మాట అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికలు లేవు. నాలుగున్నరేండ్ల పాటు కలిసిమెలిసి పని చేసుకోవాలి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 3న చెప్పాం.. పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామన్నాం. ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే నిర్ణయాత్మక నిర్ణయాలకు సహకారం అందిస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మొన్న కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. శుష్క ప్రియాలు ..శూన్య హస్తాలు, గ్యారెంటీలకు టాటా.. లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా.. డైవర్షన్ల మేళా.., హామీ పత్రాలకు పాతర.. శ్వేత పత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శస్తే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు.. ఆటో అన్నల బలవన్మరణాలు, ఓట్లకు ముందు అభయ హస్తం.. ఓట్లు పడ్డాక శూన్య హస్తం, మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం.. బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం, మూడు తిట్లు.. ఆరు అబద్దాలతో పొద్దున లేస్తే బట్ట కాల్చి మీద వేసే పనులు ఇందులో కనబడుతున్నాయని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
KTR | భవిష్యత్‌లో భట్టి పక్క కుర్చీలోకి వెళ్లాలి.. మనసారా కోరుకుంటున్నాన్న కేటీఆర్
Srisailam project | నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
Harish Rao | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు.. వరుస లైంగిక దాడులు సిగ్గుచేటు : హరీశ్‌రావు
Crime news | 24 గంటల్లో మూడు రేప్‌లు.. కదులుతున్న బస్సులో మహిళపై అఘాయిత్యం