ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 30: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పామూరుకు హైదరాబాద్ మీదుగా వెళ్లే హరికృష్ణ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు సర్వీస్ (ఏఆర్01పీ7053) ఇద్దరు డ్రైవర్లతో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్మల్ నుంచి బయలుదేరింది. సిద్ధయ్య, కృష్ణ డ్రైవర్లు. అదే బస్సులో నిర్మల్ నుంచి ఎనిమిదేండ్ల కుమార్తెతో కలిసి ఓ మహిళ ప్రయాణిస్తున్నది. అర్ధరాత్రి బస్సు చేగుంట సమీపంలోరాగా రెండో డ్రైవర్ కృష్ణ గాఢనిద్రలో ఉన్న మహిళ నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తోటి ప్రయాణికులకు చెప్పడంతో డయల్ 100కు ఫోన్ చేశారు. తార్నాక రూట్లో బస్సు వస్తున్నదని తెలుసుకున్న ఓయూ పోలీసులు మెట్రో పిల్లర్ 1010 వద్ద బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
స్నేహితుడని నమ్మితే రేప్!
వనస్థలిపురం, జూలై 30: తనను నమ్మి వచ్చిన స్నేహితురాలిపై మరో వ్యక్తితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్నది. హయత్‌నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డి, యువతి స్నేహితులు. ఆమెకు ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ ఇవ్వాలన్న గౌతంరెడ్డి కోరిక మేరకు సోమవారం రాత్రి 7.30కు ఓంకార్నగర్లోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. మద్యం మత్తు దిగిన తర్వాత వెళ్లాలని నిర్ణయించుకొని అదే హోటల్లో ఓ గదిని తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువతిని చూసిన గౌతంరెడ్డిలో రాక్షసత్వం మేల్కొన్నది. స్నేహితురాలనే విషయాన్ని మరిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతి మత్తులో ఉండటాన్ని ఆసరాగా చేసుకొని తన స్నేహితుడైన మరో యువకుడిని కూడా రప్పించాడు. ఇదే అవకాశముంటూ అతడు కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు.
ఆ యువతి నిద్రలేచే సరికి..
యువతి నిద్రలో నుంచి లేచేవరకు గదిలోనే గౌతంరెడ్డితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. రక్తస్రావం జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో దుండగులిద్దరూ గది నుంచి పరారయ్యారు. వెంటనే హోటల్ సిబ్బంది అక్కడకు చేరుకొని జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధితురాలి స్నేహితులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన స్నేహితులు జరిగిన ఘోరంపై పోలీసులకు తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. హోటల్లో సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
దివ్యాంగురాలిపై లైంగిక దాడి
శాలిగౌరారం, జూలై 30: మానసిక దివ్యాంగురాలిపై (17) దుండగుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో సోమవారం చోటుచేసుకుంది. కేసు వివరాలను శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్ఐ సైదులు మంగళవారం తెలిపారు. బాధితురాలి తండ్రితో నిందితుడు దశరథ కలిసి పనికి వెళ్లేవాడు. పనిలో భాగంగా నిత్యం వారింటికి వస్తూ పోతున్న క్రమంలో ఒంటరిగా ఉంటున్న దివ్యాంగురాలిపై కన్నేశాడు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు పనికి వెళ్లిన విషయం తెలుసుకొని ఆ ఇంటికి వెళ్లిన దశరథ దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు విషయం చెప్పడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాధితురాలిని దవాఖానాకు తరలించారు. లైంగిక దాడి విషయంపై మంగళవారం శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి గ్రామంలో విచారణ చేపట్టారు. చుట్టుపక్కల వారితో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
చిన్నారిపై లైంగికదాడి.. 20 ఏండ్ల జైలు
జగిత్యాల కలెక్టరేట్, జూలై 30: నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన మృగాడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. సీఎంఎస్ ఎస్సై రాజునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేండ్ల చిన్నారి తన ఏడేండ్ల అన్నతో కలిసి కిరాణా దుకాణానికి వెళ్తున్నది. అదే గ్రామానికి చందిన కండ్లె రమేశ్‌బాబు (32) వారిని ఆపాడు. చిన్నారి అన్నను దుకాణానికి పొమ్మని చెప్పిన రమేశ్‌బాబు.. నాలుగేండ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. దీంతో రమేశ్‌బాబు అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్సై చిర్ర సతీశ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. జగిత్యాల రూరల్ అప్పటి సీఐలు రాజేశ్, కృష్ణకుమార్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసులు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా.. పీపీ కేసు వాదించి రమేశ్‌బాబు చేసిన నేరాన్ని నిరూపించారు. దీంతో నేరస్థుడు రమేశ్‌బాబుకు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.
నమ్మించి లైంగికదాడి.. నిందితుడి అరెస్టు
బేగంపేట్ జూలై 30: ఓ యువతిని నమ్మించి లైంగికదాడికి పాల్పడి విదేశానికి పారిపోతున్న నిందితుడిని హైదరాబాద్ మహంకాళి పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ పరశురాం కేసు వివరాలను తెలిపారు. జనగాం జిల్లా గంగాపూర్‌కు చెందిన బండారం స్వామి (29) ఆస్ట్రేలియాలో పౌల్ట్రీలో జాబ్ చేస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందిన ఓ యువతి(27)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి చాటింగ్ చేస్తూ మాట్లాడుకునేవారు. అది ప్రేమగా మారి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటీవల స్వామి స్వదేశానికి వస్తున్నానని సదరు యువతిని హైదరాబాద్‌కు రావాల్సిందిగా కోరాడు. ఈ నెల 3న సికింద్రాబాద్ మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాహుల్ ఇంటర్నేషనల్ హోటల్లో వారిద్దరూ రెండురోజులపాటు బస చేశారు. ఆ తర్వాత యువతిని ఇంటికి పంపి, స్వామి జనగాంలోని సొంతూరికి వెళ్లిపోయాడు. అనంతరం యువతి పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా స్వామి నుంచి స్పందన కరువైంది. మళ్లీ విదేశానికి వెళ్తున్నట్టు తెలుసుకున్న యువతి ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును మహంకాళి పోలీసులకు బదిలీ చేశారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు నిందితుడు చేరుకున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుకున్న మహంకాళి పోలీసులు స్వామిని ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపారు.