Maharashtra : బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేయనుంది. ‘ద మహారాష్ట్ర ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్, 2026’ పేరుతో రూపొందిన ఈ చట్టం ఆగష్టు 28 నుంచి అమలులోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఈ చట్టంపై ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. ఈ చట్టం గురించి ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులను ఈ చట్టంతో నిరోధించవచ్చు. ఒక వ్యక్తిని బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించడం, లేదా అబద్ధపు హామీతో వేరే మతంలోకి మారేలా చేయడం, మతం మార్చే విషయంలో బలవంత పెట్టడం, అనుచితంగా ప్రవర్తించడం వంటివి ఈ కొత్త చట్ట ప్రకారం తీవ్రమైన నేరాలు.
ఈ నేరానికిగాను గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. గరిష్టంగా రూ.5 లక్షల జరిమానా కూడా విధిస్తారు. ఇందులో సాధారణ వ్యక్తుల్ని బలవంతంగా మతం మార్చితే రూ.1 లక్ష జరిమానా ఉంటుంది. అదే, మైనర్ లేదా మానసిక రుగ్మతలు ఉన్నవారిని, ఎస్సీ, ఎస్టీలను మతం మార్చితే మాత్రం రూ.5 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష ఉంటుంది. అలాగే, ఇది నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణిస్తారు. ఈ బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఇటీవలే అమోదించింది. అయితే, ఈ బిల్లును పలు సంస్థలు, సంఘాలు వ్యతిరేకించాయి. ఈ చట్టం తేవడమంటే ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అని విమర్శించాయి. కానీ, ఈ విమర్శల్ని మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం తిప్పికొట్టింది. బలవంతంగా మతం మార్చడాన్ని, ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చేందుకు ప్రయత్నించడాన్ని, మోస పూరితంగా మతం మార్చడాన్ని నియంత్రించేందుకే ఈ చట్టం తెచ్చామని ప్రభుత్వం చెప్పింది.
ఈ చట్టం ప్రకారం ఎవరైనా తమ ఇష్టానుసారం మతం మారాలి అనుకుంటే ఇందుకోసం సంబంధిత వ్యవస్థ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా 60 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలో కీలమైంది పిల్లలకు తల్లి మతం వర్తించడం. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఇంకో మతంలోకి మారితే.. పుట్టే పిల్లలకు తల్లి మతమే వర్తిస్తుంది. చట్ట వ్యతిరేకంగా, చట్టంతో సంబంధం లేకుండా ఎవరైనా వేరే మతంలోకి మారినప్పుడు వారి పిల్లలకు ఈ రూల్ వర్తిస్తుంది. ఇది పెళ్లైన వారికి లేదా రిలేషన్లో ఉన్న వారికి కూడా. ఈ చట్టం అన్ని మతాల వారికి సమానంగా వర్తిస్తుంది.