Party Defection Case | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తుది తీర్పు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి క్లీన్‌చీట్ వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీ కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, ఎం సంజయ్‌కుమార్, జీ మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీల వ్యవహారంపై విడతల వారీగా స్పీకర్ విచారణ జరిపారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై నాలుగు రోజుల క్రితం విచారణ పూర్తి చేశారు. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పును ప్రకటించారు.