Tollywood | టాలీవుడ్లో ఇటీవలి కాలంలో అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం సినీ అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సాధారణంగా యాక్షన్ సన్నివేశాలు, నిరంతర షూటింగ్‌లు, భారీ వర్కౌట్లు, ప్రయాణాల కారణంగా నటులకు చిన్నపాటి గాయాలు కావడం సహజమే. అయితే ఈసారి మాత్రం తెలుగు సినీ పరిశ్రమలోని నలుగురు స్టార్ హీరోలు దాదాపు ఒకే సమయంలో గాయపడటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మెగా కుటుంబం, నందమూరి కుటుంబాల నుంచి ‘బాబాయ్-అబ్బాయి’ జంటగా ఈ పరిస్థితిని ఎదుర్కొనడం అభిమానులను మరింత కలవరపెడుతోంది.
ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి గాయం కావడంతో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యకు వైద్యులు సర్జరీ చేయాలని సూచించగా, విజయవంతంగా ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గాయంతోనే తన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మణికట్టు గాయంతో అభిమానులను ఆందోళనకు గురి చేశారు. ఇటీవల ఆయన కోయంబత్తూరులోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులపాటు జాగ్రత్తలు పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ షూటింగ్‌పై ఈ గాయం పెద్దగా ప్రభావం చూపదని చిత్రబృందం భావిస్తోంది. అవసరమైన మేరకు షూటింగ్ షెడ్యూల్లో చిన్న మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా గాయంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 సినిమా షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఆయన మోకాలికి గాయమైంది. పరీక్షల అనంతరం వైద్యులు సర్జరీ చేయగా, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుంటున్నప్పటికీ కొద్ది రోజులపాటు షూటింగ్‌కు విరామం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డిసెంబర్లో విడుదల చేయాలని భావించిన NBK111 షెడ్యూల్‌పై కొంత ప్రభావం పడే అవకాశముందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. వరుస షూటింగ్‌లు, యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని, కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశముందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.